IPL 2023, DC vs KKR: హమ్మయ్య.. ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్ - 16లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. స్వంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో కేకేఆర్ భయపెట్టినా పోరాడి గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని.. చచ్చీ చెడి 19.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో సాఫీగానే సాగినా ఒక దశలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చివర్లో ఉత్కంఠగా మార్చుకుంది. డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 57, 11 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మనీష్ పాండే (23 బంతుల్లో 21, 2 ఫోర్లు), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 19 నాటౌట్, 1 ఫోర్) లు ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓడినా కేకేఆర్ బౌలర్ల పోరాటం ఆకట్టుకుంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో గత మ్యాచ్ లతో పోలిస్తే ఢిల్లీకి కాస్త మంచి ఆరంభమే దక్కింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన పృథ్వీ షా.. 11 బంతులాడి 2 ఫోర్లు కొట్టి 13 పరుగులే చేసి మరోసారి విఫలమయ్యాడు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ధాటిగా ఆడాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు.
వార్నర్ బాదుడు..
కుల్వంత్ వేసిన రెండో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన అతడు రసెల్ వేసిన మూడో ఓవర్లో కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. సునీల్ నరైన్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు ఢిల్లీ స్కోరును పవర్ ప్లే లోనే 60 పరుగులు దాటించాడు. పృథ్వీ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ (2), ఫిలిప్ సాల్ట్ (5) లు విఫలమైనా ధావన్ దూకుడు తగ్గించలేదు. అనుకుల్ రాయ్ వేసిన 11వ ఓవర్లో రెండో బంతికి బౌండరీ కొట్టి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్లో ఔటయ్యాడు.
ఢిల్లీకి ఝలక్..
వార్నర్ నిష్క్రమించిన తర్వాత ఢిల్లీకి మరో రెండు ఓవర్లకే కేకేఆర్ షాకిచ్చింది. అక్షర్ పటేల్ తో జతకలిసిన మనీష్ పాండే.. ఢిల్లీకి ఫినిషింగ్ టచ్ ఇస్తాడని ఆ జట్టు అభిమానులు భావించారు. నరైన్ వేసిన 15వ ఓవర్లో అక్షర్, మనీష్ లు తలా ఓ బౌండరీ బాదారు. కానీ అనుకుల్ రాయ్ వేసిన 16వ ఓవర్లో మనీష్ లాంగాన్ లో రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా అమన్ ఖాన్ (0) ను బౌల్డ్ చేశాడు.
ఆఖర్లో మరో డ్రామా..
ఐపీఎల్-16 లో గడిచిన రెండు వారాలుగా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ కు అలవాటు పడ్డ అభిమానులకు ఢిల్లీ ఆట చూస్తే ఈ మ్యాచ్ కూడా అలాగే ముగియక తప్పదని అర్థమైంది. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నితీశ్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయల్ లు అక్షర్, లలిత్ యాదవ్ (4 నాటౌట్) లను వణికించారు. ముఖ్యంగా 17వ ఓవర్ వేసిన నితీశ్ రాణా.. 3 పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి కూడా 3 పరుగులే ఇచ్చాడు. ఆఖరి రెండు ఓవర్లలో 11 పరుగులు కావాల్సి ఉండగా.. నితీశ్ వేసిన 19వ ఓవర్లో కూడా ఐదు పరుగులే వచ్చాయి.
ఇక లాస్ట్ ఓవర్ లో 7 ఢిల్లీ విజయానికి ఏడు పరుగులు కావాలి. నితీశ్ రాణా.. కుల్వంత్ కు బంతినిచ్చాడు. తొలి రెండు బంతులకు నాలుగు పరుగులు తీశాడు అక్షర్. ఇందులో రెండోది నో బాల్. ఆ బంతికి మళ్లీ డబుల్ తీసి ఢిల్లీ ఉత్కంఠకు తెరదించాడు అక్షర్.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో జేసన్ రాయ్ (43), ఆండ్రూ రసెల్ (38) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్ కు ఔటైనవారే. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీశాడు. అతడు నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులే ఇవ్వడం గమనార్హం. నోర్జే తో పాటు అక్షర్, కుల్దీప్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ముఖేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.