IPL 2023: ఈ సీజన్ లో ఫస్ట్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి తర్వాత రెండు మ్యాచ్ లలో అద్భుత విజయాలు అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత మళ్లీ ఓటముల బాట పట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కూడా హైదరాబాద్ ఓడింది.
ఐపీఎల్-16 లో కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లతో కొత్త సీజన్ ఆడుతున్నా.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు గత రెండేండ్లుగా పట్టి పీడీస్తున్న పాత దరిద్రం మాత్రం పోవడం లేదు. ఈ సీజన్ లో ఫస్ట్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి తర్వాత రెండు అద్భుత విజయాలు అందుకున్న సన్ రైజర్స్.. తర్వాత మళ్లీ ఓటముల బాట పట్టింది. ముంబైతో ఓడిన ఆ జట్టు శుక్రవారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో కూడా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసి 134 పరుగులకే పరిమితమైన ఎస్ఆర్‌హెచ్.. తర్వాత బౌలింగ్ లో కూడా ఆకట్టుకోలేకపోయింది. స్వల్ప లక్ష్యాన్ని చెన్నై.. 18. ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఈ పరాజయంతో సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఆడిన ఆరు మ్యాచ్ లలో రెండు గెలిచి నాలుగు ఓడిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇకనుంచి సన్ రైజర్స్ వేసే ప్రతీ అడుగూ కీలకమే. ఇక చెన్నైకి ఇది ఆరు మ్యాచ్ లలో నాలుగో విజయం. తద్వారా ఆ జట్టు.. రాజస్తాన్, లక్నోతో పాటు ఆరు పాయింట్లు సాధించినా నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానంలో ఉంది. చెపాక్ లో హైదరాబాద్ తో ఆడిన నాలుగు మ్యాచ్ లలో నాలుగింటిని చెన్నై గెలుచుకోవడం విశేషం.
135 పరుగుల లక్ష్య ఛేదనను చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (30 బంతుల్లో 35, 2 ఫోర్లు), డెవాన్ కాన్వే (57 బంతుల్లో 77 నాటౌట్, 12 ఫోర్లు,1 సిక్సర్) లు తొలి వికెట్ కు 11 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. మార్క్‌రమ్ వేసిన మూడో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన కాన్వే.. మార్కో జాన్సెన్ వేసిన ఆరో ఓవర్లో 4, 4, 6, 4, 4 బాదాడు. దీంతో ఆరు ఓవర్లలోనే చెన్నై 60 పరుగులు చేసింది. మార్కండే వేసిన 10 ఓవర్లో ఐదో బాల్ కు బౌండరీ కొట్టిన కాన్వే.. వరుసగా రెండో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఎట్టకేలకు ఓ వికెట్..
కాగా ఓపెనర్లే 135 కొట్టేస్తారేమో అని భయపడ్డ ఎస్ఆర్‌హెచ్ కు కాస్త ఉపశమనాన్నిస్తూ ఉమ్రాన్ మాలిక్ వేసిన 11వ ఓవర్లో చివరి బంతికి కాన్వే.. స్ట్రైయిట్ డ్రైవ్ ఆడాడు. బంతిని ఉమ్రాన్ అడ్డుకునే యత్నించాడు. కానీ బాల్ మిస్ అయింది. అయితే అప్పటికే రుతురాజ్ అప్పటికే క్రీజు దాటండంతో బెయిల్స్ కిందపడ్డాయి.
గైక్వాడ్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో వచ్చిన రహానే (9) ను మార్కండే పెవిలియన్ కు పంపాడు. మిడిల్ ఓవర్స్ లో సన్ రైజర్స్ స్పిన్నర్లు కాస్త ప్రభావం చూపించారు. మార్కండే వేసిన 17వ ఓవర్లో రాయుడు (9) కూడా బౌల్డ్ అయ్యాడు. కానీ కాన్వే సన్ రైజర్స్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆఖర్లో మూడు బౌండరీలు బాది చెన్నై విజయాన్ని ఖాయంచేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేశారు. అభిషేక్ శర్మ (34) టాప్ స్కోరర్. హ్యారీ బ్రూక్ (18), రాహుల్ త్రిపాఠి (21), మార్క్‌రమ్ (12), క్లాసెన్ (17) లు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా తీక్షణ, ఆకాశ్ సింగ్, పతిరనలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
