IPL 2023: రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ... మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అయినా భారీ స్కోరు చేయగలిగిన చెన్నై సూపర్ కింగ్స్.. 

చెన్నైలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు మెరుపులు మెరిపించలేకపోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.. 

ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే కలిసి తొలి వికెట్‌కి 87 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. దర్శన్ నాల్కండే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మూడో బంతికి రుతురాజ్ గైక్వాడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అది నో బాల్‌గా తేలిపోవడంతో 2 పరుగుల స్కోరు వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి లక్కీగా తప్పించుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్...

ఆ తర్వాత ఫ్రీ హిట్‌కి సిక్సర్, వెంటనే ఫోర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్, 36 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ 50+ స్కోర్లు నమోదు చేశాడు రుతురాజ్ గైక్వాడ్...

44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, మోహిత్ శర్మ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 3 బంతుల్లో 1 పరుగు చేసిన శివమ్ దూబే, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన అజింకా రహానే, దర్శన్ నల్కండే బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేసిన డివాన్ కాన్వే, మహ్మద్ షమీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన అంబటి రాయుడు, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2 బంతుల్లో ఒక్క పరుగు తీసిన మహేంద్ర సింగ్ ధోనీ, మోహిత్ శర్మ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 16 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. మొయిన్ ఆలీ 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 2023 సీజన్‌లో డెత్ ఓవర్లలో మతీశ పథిరాణా 14 వికెట్లు తీయగా మోహిత్ శర్మ 11 వికెట్లు తీసి, యజ్వేంద్ర చాహాల్, హర్షల్ పటేల్‌లతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.