IPL 2023, CSK vs DC: చెపాక్‌లో చెన్నైకి షాకివ్వాలని  చూసిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ధోని సేన  ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.  బ్యాటర్లు విఫలమైనా  బౌలర్లు రాణించి చెన్నైకి  అద్భుత విజయాన్ని అందించారు.

అనుకున్నదే అయింది. రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్ పిచ్‌పై ఢిల్లీ ఆటలు సాగలేదు. బౌలర్లు రాణించి చెన్నైని 167 పరుగులకే పరిమితం చేసినా ఈజీ టార్గెట్‌ను ఛేదించడానిక ఢిల్లీ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చెన్నై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సీఎస్కే మరింత పటిష్టపరుచుకోగా ఢిల్లీ కథ ముగిసింది. 

ఢిల్లీ ఇన్నింగ్స్ మొదట్లో దీపక్ చాహర్, మిడిల్ ఓవర్స్ లో చెన్నై స్పిన్ త్రయం మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహీశ్ తీక్షణల మాయాజాలానికి తోడు ఆఖర్లో చెన్నై తురుపుముక్క పతిరన స్పీడ్‌కు ఢిల్లీ కుదేలైంది.

మోస్తారు లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే షాకుల మీద షాకులు తాకాయి. దీపక్ చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్ లో రెండో బాల్ కే ఢిల్లీ ఓపెనర్, సారథి డేవిడ్ వార్నర్.. అజింక్యా రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 బంతుల్లో ఒక పోర్, 2 సిక్సర్లతో జోష్ లో కనిపించిన ఫిలిప్ సాల్ట్ ను కూడా చాహర్ మూడో ఓవర్లో బలిగొన్నాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్ ఫస్ట్ బాల్ ను కవర్స్ దిశగా ఆడిన మనీష్ పాండే.. అవతలి ఎండ్ లో ఉన్న మిచెల్ మార్ష్ ను పిలిచి మళ్లీ వెనక్కి వెళ్లాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న రహానే.. వేగంగా స్పందించి మార్ష్ ను రనౌట్ చేశాడు. 25 పరుగులకే ఢిల్లీ 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న పాండే - రూసో 

వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని రిలీ రూసో (37 బంతుల్లో 35, 2 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే (29 బంతుల్లో 27, 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. చాహర్ వేసిన ఐదో ఓవర్లో 6, 4 కొట్టిన రూసో తర్వాత నెమ్మదించాడు. స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఈ ఇద్దరూ బాల్ కు ఓ పరుగు అన్నట్టుగా ఆడారు. దీంతో స్కోరు వేగం నెమ్మదించింది. పది ఓవర్లకు ఢిల్లీ స్కోరు 65-3 గానే నమోదైంది. మోయిన్ అలీ వేసిన 12వ ఓవర్లో నాలుగో బాల్ కు సింగిల్ తీయడంతో ఈ ఇద్దరూ 52 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.

బ్రేక్ ఇచ్చిన పతిరన.. 

13వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన చెన్నై తురుపుముక్క మతీశ పతిరన వేసిన ఓవర్లో ఫస్ట్ బాల్ కు మనీష్ పాండే డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. కానీ ఇదే ఓవర్లో ఆఖరి బంతికి పతిరన వేసిన క్లీన్ యార్కర్‌‌తో పాండే వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. జడేజా వేసిన 15వ ఓవర్లో మూడో బాల్ కు రూసో కూడా భారీ షాట్ ఆడి లాంగాన్ వద్ద పతిరన కు క్యాచ్ ఇచ్చాడు. 

చివరి 3 ఓవర్లలో.. 

మరీ నెమ్మదిగా ఆడటంతో చివర్లో ఢల్లీ విజయానికి 3 ఓవర్లలో 60 పరుగులు కావాల్సి వచ్చింది. పతిరన వేసిన 18వ ఓవర్లో.. 12 పరుగులే వచ్చాయి. ఈ ఓవర్లో ఐదో బాల్ కు అక్షర్ పటేల్ (12 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. తుషార్ వేసిన 19వ ఓవర్లో 4 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్లో 44 పరుగులు చేయాల్సి ఉండగా లలిత్ యాదవ్ (12) మూడు ఫోర్లు కొట్టినా అవి ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. 

చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. జడేజా 4 ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మోయిన్ అలీ నాలుగు ఓవర్లు వేసి వికెట్ తీయకున్నా 16 పరుగులే ఇచ్చాడు. తీక్షణ కూడా 2 ఓవర్లలో 16 పరుగులే ఇచ్చాడు. చాహర్ 2, పతిరన 2 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. శివమ్ దూబే (25) టాప్ స్కోరర్. చివర్లో ధోని 9 బంతుల్లోనే 2 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి సీఎస్కేకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.