TATA IPL 2022: ప్రతి ఐపీఎల్ సీజన్ కొందరు కొత్త కుర్రాళ్లను పరిచయం చేస్తున్నది.  ఇందులో నిజంగా టాలెంట్ ను నమ్ముకుని వచ్చినోళ్లు  మాత్రం ఎప్పటికీ విఫలం కాలేదు. ఈ సీజన్ లో కూడా అలాంటి జాబితాలో చేరదగిన ఆటగాడు కుల్దీప్ సేన్.. ఎవరీ మట్టిలో మాణిక్యం..? 

రాజస్థాన్ రాయల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్. ఆఖరి ఓవర్లో   లక్నో విజయానికి 15 పరుగులు కావాలి.  క్రీజులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్.  అయితే అప్పటికే రాజస్థాన్ కీలక బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ ల నాలుగు ఓవర్ల కోటా అయిపోయింది. మిగిలింది కుల్దీప్ సేన్. కొత్త కుర్రాడు. పైగా ఆడుతున్నది తొలి మ్యాచ్. అప్పటికే మూడు ఓవర్లలో 24 పరుగులిచ్చాడు.  సంజూ శాంసన్ అతడిని నమ్మాడు. 15 పరుగులు చేయాల్సిన క్రమంలో  వీర బాదుడు బాదే స్టోయినిస్ ను అద్భుతంగా కట్టడి చేశాడు ఆ కుర్రాడు. తన ఆఖరి ఓవర్లో.. 11 పరుగులే ఇచ్చి రాజస్థాన్ కు  విజయాన్ని ఖాయం చేశాడు. అసలు ఎవరీ కుల్దీప్ సేన్..? అతడి కథా కమామీషు ఏంటి..? 

మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లా హరిహాపూర్  కుల్దీప్ సొంత ఊరు.  రాంపాల్ సేన్-గీతా సేన్ ల సంతానం.  రాంపాల్-గీతాలకు కలిగిన ఐదుగురు సంతానంలో మూడోవాడు.  రాంపాల్ సేన్ స్థానికంగా ఓ చిన్న హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. 

చిన్నప్పట్నుంచే.. 

కుల్దీప్ కు చిన్నప్పట్నుంచే క్రికెట్ మీద ఆసక్తి. ఎనిమిదేండ్ల వయసు నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.  అతడి ఆసక్తి, పట్టుదల చూసిన స్థానిక క్రికెట్ అకాడమీ (వింద్యా క్రికెట్ అకాడమీ) కుల్దీప్ దగ్గర ఫీజు కూడా తీసుకోలేదు. కుల్దీప్ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న వింద్యా క్రికెట్ అకాడమీ.. అతడి కోచింగ్ కు అయ్యే ఖర్చులను  భరించింది.  కుల్దీప్ అక్కడే తన బౌలింగ్ లో మెరుగులు దిద్దుకున్నాడు. 

రంజీ లో ఎంట్రీ.. 

2018 రంజీ సీజన్ లో దేశవాళీలోకి ఎంట్రీ ఇచ్చాడు కుల్దీప్. అరంగేట్ర మ్యాచ్ లోనే పంజాబ్ తో ఐదు వికెట్లు పడగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సీజన్ లో మొత్తంగా 25 వికెట్లు తీసుకున్నాడు కుల్దీప్. ఇప్పటివరకు మొత్తంగా 16 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన   ఈ యువ బౌలర్.. 44 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా కుల్దీప్.. ముంబైతో జరిగిన టీ20 మ్యాచ్ లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్ లో  3 ఓవర్లు వేసిన 22 పరగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.  అయితే  కుల్దీప్ లో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించిన రాజస్థాన్ యాజమాన్యం.. ఈ యేడు వేలంలో అతడిని రూ. 20 లక్షలకు దక్కించుకుంది. 

 

Scroll to load tweet…

ఇక రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు కుల్దీప్. లక్నోతో మ్యాచ్ లో అతడు వేసిన ఆఖరి ఓవర్లో... తొలి బంతికి అవేశ్ ఖాన్ సింగిల్ తీసి స్టోయినిస్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. అయితే ఎటువంటి బంతినైనా అలవోకగా బౌండరీ దాటించే స్టోయినిస్ ను వరుసగా 3 బంతుల పాటు  ఒక్క పరుగు కూడా కొట్టనీయకుండా బౌలింగ్ చేశాడు కుల్దీప్.  ఆఖరు రెండు బంతులకు పది పరుగులిచ్చినా అప్పటికే   లక్నో  పరాజయం ఖరారైంది. 

తండ్రి హెయిర్ సెలూన్ లోనే.. 

అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు పొందుతున్న కుల్దీప్ యాదవ్ లక్నోతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు తన తండ్రి హెయిర్ సెలూన్ షాప్ లోనే ఉన్నాడట.  షాప్ లో పని చేసుకుంటూ తన  వృత్తి తాను చేసుకున్నాడని స్థానిక వార్తా పత్రికలు రాసుకొచ్చాయి.