TATA IPL 2022 RR vs MI: రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ సీజన్ లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పర్పుల్ క్యాప్ దక్కించుకున్న చాహల్.. ముంబైతో ముగిసిన శనివారం నాటి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
రాజస్తాన్-ముంబైల మధ్య శనివారం రాత్రి డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్ లో రాజస్తాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతడు ఎంతో కాన్ఫిడెంట్ గా ఔట్ అవుతుందనుకుని ఇచ్చిన డీఆర్ఎస్ నిర్ణయం తనకు అనుకూలంగా రాలేదు. అయితే అక్కడే ఉన్న ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. అతడిని ఓదార్చాడు. డీఆర్ఎస్ కోసం అప్పీల్ చేసింది సూర్యకుమార్ కోసమే. కాగా డీఆర్ఎస్ ద్వారా తనకు అనుకూల నిర్ణయం రాకపోయినా ఆ తర్వాత అతడిని మళ్లీ చాహలే ఔట్ చేయడం విశేషం.
ముంబై బ్యాటింగ్ చేస్తున్న సందర్బంలో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన చాహల్.. ఆఖరి బంతి సూర్య ప్యాడ్స్ కు తాకింది. అయితే అతడు చాలా కాన్ఫిడెంట్ గా అంపైర్ నిర్ణయం కోసం అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం దానిని నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో చాహల్.. శాంసన్ ను ఒప్పించి డీఆర్ఎస్ తీసుకున్నాడు.
అయితే డీఆర్ఎస్ లో.. బంతి సూర్య ప్యాడ్స్ కు తాకినా అది ఆఫ్ స్టంప్ కు కొద్దిగా ఆవల వెళ్తున్నట్టు కనిపించింది. దీంతో సూర్య బతికిపోయాడు. అప్పటికీ సూర్య చేసింది 18 బంతుల్లో 27 పరుగులే... ముంబై స్కోరు కూడా 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు. ఆ క్రమంలో మరో వికెట్ పడుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ అదృష్టం సూర్యవైపు నిలిచింది.
అయితే డీఆర్ఎస్ ఫలితం వెలువడగానే చాహల్ తీవ్ర నిరాశలో కనిపించాడు. కానీ సూర్య అతడి దగ్గరికి వెళ్లి.. మనసారా హత్తుకుని ఓదార్చాడు. అయితే సూర్య హత్తుకున్నా చాహల్ ముఖంలో మాత్రం కవలికలు మారలేదు. కాగా మ్యాచ్ అనంతరం సూర్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో.. చాహల్ ను హత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ ‘యే ప్యార్ అలగ్ హై’ అని రాసుకొచ్చాడు. చాహల్ భార్య ధనశ్రీ వర్మ ను ట్యాగ్ చేస్తూ ఈ స్టోరీ పోస్ట్ చేశాడు.
చాహల్ ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాక సూర్య.. తిలక్ వర్మ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 81 పరుగులు జోడించి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలాఉండగా హాఫ్ సెంచరీ తర్వాత చాహల్ వేసిన 15వ ఓవర్ చివరి బంతిని భారీ షాట్ ఆడిన సూర్య.. లాంగాన్ వద్ద రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్ లోనే లైఫ్ పొందిన సూర్య.. చివరికి అతడి బౌలింగ్ లోనే ఔటవడం విశేషం.
ఇక రాజస్తాన్-ముంబై మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (67) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై.. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (51), తిలక్ వర్మ (35) లు రాణించగా ఆఖర్లో టిమ్ డేవిడ్ (20 నాటౌట్) మెరుపులతో ముంబై కి ఈ సీజన్ లో తొలి విజయం దక్కింది.
