TATA IPL 2022 PBKS vs RCB: ఓపెనర్ గా ప్రమోట్ అయిన  పంజాబ్ కింగ్స్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఎట్టకేలకు తనలోని హిట్టర్ ను బయటకు తీశాడు.  రాజస్తాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. ఆఖర్లో జితేశ్ శర్మ, లివింగ్ స్టోన్ కూడా  మెరవడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. 

ఐపీఎల్-15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఈ సీజన్ లో ఓపెనర్లుగా వస్తున్న మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ లను కాదని పంజాబ్ యాజమాన్యం.. ధావన్ కు జతగా బెయిర్ స్టో ను పంపింది. అందుకు తగ్గట్టుగానే అతడు రాణించాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. అతడికి తోడుగా ఆఖర్లో జితేశ్ శర్మ, లివింగ్ స్టోన్ కూడా మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కింగ్స్ కు బెయిర్ స్టో మెరుపు ఆరంభాన్నిచ్చాడు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు. కుల్దీప్ సేన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టాడు. అయితే మరో ఎండ్ లో ధావన్ (12) మాత్రం క్రీజులో నిలవడానికి ఇబ్బందిపడ్డాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక్క పరుగు కూడా తీయలేని అతడు అశ్విన్ వేసిన ఐదో ఓవర్లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ధావన్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన భానుక రాజపక్స (18 బంతుల్లో 27.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. చాహల్ వేసిన 11వ ఓవర్లో తొలి బంతికి బౌల్డ్ అయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినా మయాంక్ అగర్వాల్ (15) ఆట మారలేదు. అతడు కూడా చాహల్ వేసిన 15వ ఓవర్లో మొదటి బంతికి బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఓవర్లోనే హాఫ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బెయిర్ స్టో ను కూడా చాహల్.. నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూ చేశాడు. అప్పటికీ 15 ఓవర్లకు పంజాబ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు. 

Scroll to load tweet…

ఆ క్రమంలో క్రీజులోకి అడుగుపెట్టిన లివింగ్ స్టోన్ (14 బంతుల్లో 22.. 1 ఫోర్, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (18 బంతుల్లో 38 నాటౌట్) లు ధాటిగానే ఆడారు. ప్రసిధ్ కృష్ణ వేసిన 17వ ఓవర్లో 15 పరుగులు రాగా.. చాహల్ వేసిన తర్వాత ఓవర్లో 11 పరుగులే వచ్చాయి. ప్రసిధ్ వేసిన 19వ ఓవర్లో లివింగ్ స్టోన్.. 6, 4 బాదినా ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే కుల్దీప్ వేసిన ఆఖరి ఓవర్లో జితేశ్.. 6, 4, 4 బాదాడు. ఆఖరి 5 ఓవర్లలో పంజాబ్ కు 67 పరుగులు వచ్చాయి. 

చాహల్ రికార్డు : 

అగర్వాల్ వికెట్ తీయగానే చాహల్ రాజస్తాన్ తరఫున ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. మయాంక్ వికెట్ చాహల్ కు ఈ సీజన్ లో 21వది. రాజస్తాన్ తరఫున శ్రేయస్ గోపాల్ 2019లో 20 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అదే రికార్డు. మొత్తంగా ఈ మ్యాచ్ లో చాహల్.. 3 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ బౌలర్లలో అశ్విన్, ప్రసిధ్ లకు ఒక వికెట్ దక్కింది. ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్ లకు ఒక్క వికెట్ దక్కలేదు.