Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: ఓటమితోనే సీజన్‌ని ముగించిన చెన్నై... ప్లేఆఫ్స్‌కి రాజస్థాన్ రాయల్స్...

సీజన్‌లో 10వ పరాజయాన్ని మూటకట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్... ఘన విజయంతో ప్లేఆఫ్స్‌కి రాజస్థాన్ రాయల్స్... యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్...

IPL 2022: Rajasthan Royals beats Chennai Super Kings, CSK finishes season with defeat
Author
India, First Published May 20, 2022, 11:12 PM IST

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయంతో ఐపీఎల్ 2022 సీజన్‌కి ముగింపు పలికింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల తేడాతో సీజన్‌లో 10వ పరాజయాన్ని అందుకున్న సీఎస్‌కే, పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో ముగించనుంది... సీజన్‌లో 9వ విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, లీగ్ స్టేజ్‌ని టాప్ 2లో ముగించి, క్వాలిఫైయర్‌ 1కి అర్హత సాధించింది.

151 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కి శుభారంభం దక్కలేదు. సీజన్ సెకండాఫ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న జోస్ బట్లర్, 5 బంతుల్లో 2 పరుగులు చేసి సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... 

ఆ తర్వాత సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కలిసి రెండో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన సంజూ శాంసన్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

9 బంతుల్లో 3 పరుగులు చేసి దేవ్‌దత్ పడిక్కల్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ప్రశాంత్ సోలంకి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

సిమ్రాన్ హెట్మయర్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్... అయితే రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్ కలిసి ఆరో వికెట్‌కి పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాజస్థాన్ రాయల్స్‌కి ఘన విజయాన్ని అందించారు... 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, 10 పరుగులు చేసిన రియాన్ పరాగ్‌తో కలిసి లాంఛనాన్ని ముగించాడు.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయగలిగింది. రుతురాజ్ గైక్వాడ్ 6 బంతుల్లో 2 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ కలిసి రెండో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డి వాన్ కాన్వే సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేస్తుంటే మొయిన్ ఆలీ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో 4, 4, 6, 4తో 18 పరుగులు రాబట్టిన మొయిన్ ఆలీ, అశ్విన్ వేసిన 5వ ఓవర్‌లో 4, 4, 6 బాది 16 పరుగులు రాబట్టాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో 6, 4, 4, 4, 4,4 లతో ఏకంగా 26 పరుగులు రాబట్టుకున్నాడు మొయిన్ ఆలీ...

మొయిన్ ఆలీ విధ్వంసంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 75 పరుగులు చేసింది సీఎస్‌కే. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన డివాన్ కాన్వే, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో ఈ పార్టనర్‌షిప్‌కి బ్రేక్ పడింది...

ఆ తర్వాతి ఓవర్‌లో ఎన్‌ జగదీశన్ 1 పరుగు చేసిన ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, 3 పరుగులు చేసిన అంబటి రాయుడు, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్‌తో పాటు జేమ్స్ నీశమ్ క్యాచులు డ్రాప్ చేయడంతో మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎమ్మెస్ ధోనీ... 28 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 

ఆ తర్వాతి బంతికే మొయిన్ ఆలీ కూడా అవుట్ అయ్యాడు. 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు... 

మొయిన్ ఆలీ క్యాచ్‌లో ఈ సీజన్‌లో 15 క్యాచులు పూర్తి చేసుకున్నాడు రియాన్ పరాగ్. ఒకే సీజన్‌లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్‌గా కొత్త రికార్డు క్రియేట్ చేశాడు పరాగ్. ఇంతకుముందు 2021, 2015 సీజన్లలో 13 క్యాచులు అందుకున్న రవీంద్ర జడేజా రికార్డును అధిగమించాడు రియాన్ పరాగ్... 

6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 75 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, మిగిలిన 14 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోవడం విశేషం. 8వ ఓవర్ తర్వాత 45 బంతుల పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు...

Follow Us:
Download App:
  • android
  • ios