TATA IPL 2022 RR vs MI: సారథి పుట్టినరోజున ముంబై ఇండియన్స్ బౌలర్లు ఒలళ్లు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేశారు. బట్లర్, శాంసన్ వంటి వీర విద్వంసక ఆటగాళ్లను నిలువరించి రాజస్తాన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
ప్లేఆఫ్ ఆశలు అడుగంటిన వేళ ముంబై ఇండియన్స్ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. రాజస్తాన్ రాయల్స్ ను భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. క్రీజులో 15 ఓవర్ల దాకా బట్లర్ వంటి ఆటగాడు ఉన్నా అతడికి హిట్టింగ్ కు అవకాశమివ్వలేదంటే ముంబై బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆఖర్లో కాస్త పట్టు తప్పినా రాజస్తాన్ ను అద్భుతంగా కట్టడిచేశారు. రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్ (52 బంతుల్లో 67.. 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి రాణించాడు. ఆఖర్లో అశ్విన్ మెరుపులతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 చేసింది.
టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ను నెమ్మదిగానే ఆరంభించింది. డేనియల్ సామ్స్ వేసిన మూడో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన దేవదత్ పడిక్కల్ (15) ఐదో ఓవర్ వేసిన హృతిక్ షోకీన్ బౌలింగ్ లో పొలార్డ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
పడిక్కల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సంజూ శాంసన్ షోకీన్ వేసిన ఏడో ఓవర్లో రెండు సిక్సర్లు బాది జోరు మీద కనిపించినా దానిని కొనసాగించలేకపోయాడు. కుమార్ కార్తీకేయ వేసిన తర్వాతి ఓవర్లో టిమ్ డేవిడ్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 8 ఓవర్లలో 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఆ క్రమంలో జోస్ బట్లర్ తో జత కలిశాడు డారెల్ మిచెల్ (20 బంతుల్లో 17.. 1 ఫోర్). అయితే ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో రాజస్తాన్ కు పరుగుల రాక కష్టమైంది. వీర విధ్వంసకర బట్లర్ కూడా సింగిల్స్ తోనే ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. పది ఓవర్లకు రాజస్తాన్ స్కోరు 73 పరుగులే. ఆ తర్వాత సుమారు ఐదు ఓవర్ల (33బంతులు) పాటు రాజస్తాన్ కు బౌండరీ రాలేదు.
స్కోరు బోర్డు నెమ్మదిగా ఉండటంతో 15వ ఓవర్లో గేర్ మారుద్దామనుకున్న మిచెల్.. కవర్స్ లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ ఆ తర్వాత బట్లర్ జోరు పెంచాడు. షోకీన్ వేసిన 16వ ఓవర్ లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన బట్లర్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆఖరు బంతికి సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ ఓవర్లో బట్లర్ ఔటైనా రాజస్తాన్ కు ఏకంగా 24 పరుగులొచ్చాయి.
ఇక ఆఖర్లో.. హెట్మెయర్ (6 నాటౌట్), అశ్విన్ ( 9 బంతుల్లో 21.. 3 ఫోర్లు, 1 సిక్సర్) బాదడానికి ప్రయత్నించారు. కానీ ముంబై బౌలర్లు వారి ఆటలు సాగనివ్వలేదు. ఫలితంగా రాజస్తాన్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో షోకీన్, మెరిడిత్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. కుమార్ కార్తీకేయ, డేనియల్ సామ్స్ కు ఒక వికెట్ దక్కింది.
ముంబైపై గడిచిన ఆరు ఇన్నింగ్స్ లో బట్లర్ స్కోర్లు ఇవి..
- 67 (ప్రస్తుత మ్యాచ్)
- 100
- 41
- 70
- 89
- 94 నాటౌట్
ఐపీఎల్ లో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు :
- జోస్ బట్లర్ (566) - 2022
- అజింక్యా రహానే (560) - 2012
- జోస్ బట్లర్ (548) - 2018
- షేన్ వాట్సన్ (543) - (2103)
