Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: పంజాబ్-ఢిల్లీలకు డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ గెలిచిన మయాంక్ అగర్వాల్..

IPL 2022 PBKS vs DC: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో  నాలుగో స్థానంలో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పోటీగా నిలిచేదెవరో మరికొద్దిసేపట్లో తేలనుంది.  పాయింట్ల పట్టికలో 5, 7 స్థానాలలో ఉన్న  పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు ఆసక్తికర పోటీ జరుగనున్నది. 

IPL 2022: Punjab Kings Wins Toss and opt Bowl First Against Delhi Capitals
Author
India, First Published May 16, 2022, 7:04 PM IST

ఐపీఎల్-15 లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. పడుతూ లేస్తూ ఇక్కడిదాకా వచ్చిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య  అత్యంత కీలక మ్యాచ్ జరుగనున్నది. షార్ట్కట్స్ ఏమీ లేవు.. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీకి పోటీ నిస్తుంది. ఓడిన జట్టు  బ్యాగ్ సర్దుకోవడమే.  ఒకరకంగా రెండు జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై పరిస్థితి. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో  మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  రిషభ్ పంత్ నేతృత్వంలోని  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. పంజాబ్.. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే  బరిలోకి దిగుతుండగా ఢిల్లీ మాత్రం రెండు మార్పులతో ఆడుతున్నది. చేతన్ సకారియా స్థానంలో ఖలీల్ అహ్మద్ ఆడుతుండగా.. శ్రీకర్ స్థానంలో సర్ఫరాజ్ ఆడుతున్నారు. 

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (12 మ్యాచులు.. 6 విజయాలు, 6 పరాజయాలు.. 12 పాయింట్లు) నెట్ రన్ రేట్ (+0.210) విషయంలో పంజాబ్ కంటే మెరుగ్గా ఉంది.  పంజాబ్ కింగ్స్  ఆడిన 12 మ్యాచుల్లో ఢిల్లీ మాదిరే 6 మ్యాచుల్లో గెలిచి ఆరింట్లో ఓడింది.  పంజాబ్ కు కూడా 12 పాయింట్లే ఉన్నా.. నెట్ రన్ రేట్ (+0.023)  కాస్త తక్కువగా ఉంది. 

ఈ మ్యాచ్ లో గెలవడమే కాదు.. నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకోవడం కూడా పంజాబ్ కు ముఖ్యమే. అలా అయితేనే నాలుగో స్థానంలో ఉన్న  ఆర్సీబీతో ప్లేఆఫ్ రేసులో పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది.  గత మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లను ఉతికారేసిన బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ లో నేటి పోరులో కూడా అదే ఆటతీరు  కొనసాగిస్తే ఢిల్లీ బౌలర్లకు తిప్పలు తప్పవు. 

ఇక ఢిల్లీ కూడా గత మ్యాచ్ లో రాజస్తాన్ ను 8 వికెట్ల తేడాతో ఓడించి దూకుడుమీదుంది. అదే ప్రదర్శనను నేటి మ్యాచ్ లో కొనసాగించి పంజాబ్ కు అవకాశమివ్వకుండా తానే  ప్లేఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకునే దిశగా ముందంజ వేయాలని భావిస్తున్నది.  డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు గత మ్యాచ్ మాదిరిగానే నేడు కూడా విజృంభించాలని కోరుకుంటున్నది. 

ముఖాముఖి: ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 29 మ్యాచులు జరుగగా అందులో 14 సార్లు పంజాబ్ నెగ్గింది. 15 సార్లు ఢిల్లీని విజయం వరించింది.  

తుది జట్లు : 

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రొవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్,  కుల్దీప్  యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్త్జ్ 

పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేశ్ శర్మ, హర్ప్రీత్ బ్రర్, రిషి ధావన్, కగిసొ రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ 

Follow Us:
Download App:
  • android
  • ios