MS Dhoni TATA IPL 2022 Promo: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి   మహేంద్ర సింగ్ ధోనికి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్సీఐ) భారీ షాకిచ్చింది.  ధోని నటించిన ఓ యాడ్ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని... 

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని నటించిన ఓ యాడ్ పై ఎఎస్సీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని దానిని తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. ఇటీవలే విడుదలైన టాటా ఐపీఎల్-2022 కు సంబంధించి ధోని.. బస్ డ్రైవర్ గా ఓ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. ఊర మాస్ లుక్ లో కనిపించిన ధోని.. బస్ ను రోడ్డుకు అడ్డంగా ఆపడమే కాకుండా పోలీసు అడిగినా పట్టించుకోనట్టు వ్యవహరిస్తాడు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎఎస్సీఐ గడప తొక్కారు. 

రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, కంజ్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ (కట్స్) లు కలిసి ధోని నటించిన యాడ్ మీద ఎఎస్సీఐ కి ఫిర్యాదు చేశాయి. ఈ ప్రోమో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిచడమేనని ఫిర్యాదులో పేర్కొన్నాయి. యాడ్ లో మార్పులు చేయడం గానీ లేదంటే పూర్తిగా తొలగించడమో గానీ చేయాలని ఎఎస్సీఐ ని కోరాయి.

ఐపీఎల్ ప్రోమోకు సంబంధించి.. ఈ సీజన్ కొత్తలో యాడ్ విడుదలైంది. ఈ యాడ్ లో ధోని బస్ డ్రైవర్ గా కనిపించాడు. ఇందులో రోడ్డు మీద ఎర్రబస్సు వెళ్తూ ఉండగా ఓ చోట ధోని బస్ ను ఉన్నఫళంగా ఆపేస్తాడు. కాస్త వెనక్కి తీసుకువస్తూ.. ఓ టీవీల షో రూం ముందు ఉంచుతాడు. అందరూ ఇదేంటి ఇలా చేస్తున్నాడని అడుగుతుండగా.. ధోని వచ్చి బస్ డోర్ దగ్గర కూర్చుని మ్యాచ్ చూస్తుంటాడు. అయితే అటుగా వెళ్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్.. బస్ ఇక్కడెందుకు ఆపావ్..? అని అడగ్గా ఐపీఎల్ లో సూపర్ ఓవర్ నడుస్తోంది అని చెప్తాడు. అయితే ఈ యాడ్ పై రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, కట్స్ లు ఎఎస్సీఐని ఆశ్రయించాయి. 

Scroll to load tweet…

వారి వాదనలను విన్న ఎఎస్సీఐ.. ఈ యాడ్ ను ఉపసంహరించుకోవాలని లేదంటే మార్పులు చేయాలని ఐపీఎల్ నిర్వాహకులకు సూచించింది. ఈనెల 20 నాటికి ఈ యాడ్ ను పూర్తిగా తొలిగిస్తామని ఐపీఎల్ నిర్వాహకులు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. మార్చి 26న ఐపీఎల్ మొదలవగా.. ఏప్రిల్ 20 నాటికి యాడ్ ను తీసేస్తామంటే.. అప్పటికే సీజన్ స్టార్ట్ అయి సుమారు నెల గడుస్తుంది. 

ఇక లీగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఇప్పటివరకు లీగ్ లో 15 మ్యాచులు (లక్నో-ఢిల్లీ మ్యాచ్ తో కలిపి) జరిగాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ లు టాప్-4లో ఉన్నాయి. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని జట్లుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (3 ఓటములు), సన్ రైజర్స్ హైదరాబాద్ (2 ఓటములు) ఉన్నాయి.