TATA IPL 2022 PBKS vs RR: ప్లేఆఫ్ రేసు దగ్గరపడుతున్న కొద్దీ ఐపీఎల్ లో  ఆసక్తి, ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో  నేడు  పంజాబ్ కింగ్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరుగనుంది. 

ఐపీఎల్ లో ఇంతవరకు కప్ కొట్టని పంజాబ్ కింగ్స్.. నేడు ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ రేసులో ఉండాలో.. వెళ్లాలో నిర్ణయించుకోనుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఆ జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. తొలుత వరుస విజయాలతో అదరగొట్టిన రాజస్తాన్ రాయల్స్ కూడా గత రెండు మ్యాచులలో అనూహ్య పరాజయాలను అందుకుంది. తిరిగి విజయాల బాట పట్టడమే గాక ప్లేఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి గాను.. నేడు ముంబై లోని వాంఖెడే స్టేడియం వేదికగా ఇరు జట్లు కీలక పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచులలో 6 నెగ్గి నాలుగు ఓడి 12 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ గత రెండు మ్యాచులలో అనూహ్య పరాజయం పాలైంది. అయితే ఆ జట్టుకు మరో రెండు మ్యాచులు గెలిచినా ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది.

కానీ పంజాబ్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. 10 మ్యాచుల్లో ఐదు గెలిచి అన్నేమ్యచులు ఓడిన ఆ జట్టు.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నేటితో పాటు తర్వాత జరుగబోయే 3 మ్యాచుల్లో నెగ్గాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఓడితే పంజాబ్ కథ దాదాపు ముగిసినట్టే. 

ఈ సీజన్ లో తొలుత వరుస విజయాలు, అబ్బురపరిచే ప్రదర్శనలతో ఆకట్టుకున్న రాజస్తాన్.. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచులలో ఓడింది. ఆ ఓటముల నుంచి బయటకు వచ్చి తిరిగి విజయాల బాట పట్టాలని శాంసన్ సేన పక్కా ప్రణాళికలతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నది. బ్యాటింగ్ లో జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, షిమ్రన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో కూడా ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ లతో పాటు స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. 

ఇక పంజాబ్ విషయానికొస్తే.. మయాంక్ అగర్వాల్ ఫామ్ లేమి జట్టును తీవ్రంగా వేధిస్తున్నది. శిఖర్ ధావన్ కూడా ఓ మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్ లో విఫలమవుతున్నాడు. లివింగ్ స్టోన్, బెయిర్ స్టో లు కూడా పెద్దగా మెరుపులు మెరిపించడం లేదు. రాజపక్స ఏ మ్యాచ్ లో ఆడుతున్నాడు..? ఎప్పుడు పక్కనబెడుతున్నారో అర్థం కావడం లేదు. లోయరార్డర్ లో వచ్చే ఆటగాళ్లెవరూ సరిగా బ్యాట్ ఝుళిపించలేకపోతున్నారు. బౌలింగ్ లో రబాడా రాణిస్తున్నాడు. అర్షదీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీయడం లేదు. స్పిన్నర్ రాహుల్ చాహర్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. మరి నేటి కీలక మ్యాచ్ లో పంజాబ్ ఎలా ఆడుతందనేది ఆసక్తికరంగా మారింది. 

ముఖాముఖి: ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తంగా 23 మ్యాచులు జరిగాయి. వాటిలో రాజస్తాన్ 13 మ్యాచులు గెలవగా పంజాబ్ పది మ్యాచుల్లో గెలిచింది. 

తుది జట్లు :

రాజస్తాన్ రాయల్స్ : జోస్‌ బట్లర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, షిమ్రన్‌ హెట్మెయర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ సేన్‌

పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జతేశ్‌ శర్మ, రిషి ధావన్‌, కగిసొ రబాడ, రాహుల్‌ చాహర్‌, అర్ష్దీప్ సింగ్‌, సందీప్‌ శర్మ