ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి మ్యాచ్ రిఫరీగా హైదరాబాదీ... మాజీ క్రికెటర్ డానియల్ మనోహర్‌కి...
ఐపీఎల్‌లో మ్యాచ్ రిఫరీగా వ్యవహరించబోయే తొలి హైదరాబాదీగా రికార్డు క్రియేట్ చేయబోతున్న డానియల్ మనోహర్... కోచ్‌గా మారాలని కలలు కని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ దక్కక...
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ సమరం ఐపీఎల్ ఇప్పటికే 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. 10 ఫ్రాంచైజీలతో సాగే ఐపీఎల్ 2022 సీజన్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా మొట్టమొదటిసారిగా ఓ హైదరాబాదీ, మ్యాచ్ రిఫరీగా సేవలు అందించబోతున్నాడు... హైదరాబాద్‌కి చెందిన 48 ఏళ్ల డానియల్ మనోహర్, ఐపీఎల్‌లో మ్యాచ్ రిఫరీగా వ్యవహరించబోయే తొలి హైదరాబాదీగా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...
మార్చి 26 నుంచి ముంబై, పూణేల్లోని స్టేడియాల్లో జరగబోయే ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించి ఆరుగురు మ్యాచ్ రిఫరీలతో ప్యానెల్‌ను ఎంపిక చేసింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్‌తో పాటు మాజీ రంజీ ప్లేయర్, హైదరాబాద్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ డానియల్ మనోహర్‌కి ఈ ప్యానెల్‌లో చోటు దక్కింది...
ఇంతకుముందు ఇవటూరి శివరాం, షంసుద్దీన్, నంద కిషోర్... ఐపీఎల్‌లో హైదరాబాద్ నుంచి అంపైర్లుగా వ్యవహరించారు. అలాగే హైదరాబాద్ నుంచి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌కి రిఫరీగా సేవలు అందించిన జీఎస్ లక్ష్మీ... ప్రస్తుతం వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం న్యూజిలాండ్‌లో ఉంది...
‘ఐపీఎల్‌లో మ్యాచ్ రిఫరీగా ఇదే నాకు మొదటి అవకాశం. అంతర్జాతీయ మ్యాచులకు రిఫరీగా చేయాలనేది నా కల. ఆ కల వైపు అడుగులు వేసేందుకు ఐపీఎల్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా... కోట్లాది మంది వీక్షించే ఐపీఎల్‌లో మ్యాచ్ రిఫరీలపైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకునేందుకు ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధమవుతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు డానియల్ మనోహర్...
ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 8 సెంచరీలతో 4009 పరుగులు చేసిన డానియల్ మనోహర్, తన తొలి మ్యాచ్‌లో కర్ణాటకపై 144 పరుగులు చేసి అదరగొట్టాడు. భారత మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే వంటి క్రీడా దిగ్గజాల బౌలింగ్‌ను ఎదుర్కొంటూ చేసిన ఈ సెంచరీ... అప్పట్లో మనోహర్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది...
భారత ఏ జట్టుతో పాటు విల్స్ వన్డే ట్రోఫీలోనూ ఆడిన డానియల్ మనోహర్, 73 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 20 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలతో 4009 పరుగులు చేసి, బౌలింగ్‌లో 65 వికెట్లు పడగొట్టాడు. 36 లిస్టు ఏ మ్యాచుల్లో 2 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1287 పరుగులు చేసిన డానియల్ మనోహర్, బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టాడు. 2007-08 సీజన్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
క్రికెట్ కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోచ్‌గా కెరీర్ మొదలెట్టాలని భావించాడు డానియల్ మనోహర్. అయితే అతనికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నుంచి సరైన సపోర్ట్ లభించలేదు...
అంపైర్‌గా అయ్యేందుకు సరిపడా ఓపిక, సహనం తన దగ్గర లేవని గ్రహించిన డానియల్ మనోహర్, మ్యాచ్ రిఫరీగా మారాడట. రిఫరీగా 88 మ్యాచులు ఆడిన డానియల్ మనోహర్, జూనియర్, రంజీ మ్యాచులతో పాటు ఇండియా ఏ మ్యాచులకు కూడా సేవలు అందించాడు...