Quinton de Kock - KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు  క్వింటన్ డికాక్-కెఎల్ రాహుల్  లు కోల్కతా నైట్ రైడర్స్ తో  జరుగుతున్న మ్యాచ్ లో  పలు కీలక రికార్డులు బద్దలుకొట్టారు. 

ఐపీఎల్-15లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కెఎల్ రాహుల్ లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ కలసి కేకేఆర్ తో ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో రెచ్చిపోయి ఆడి కోల్కతా బౌలర్లకు పీడకలలు మిగిల్చారు. ఈ సందర్బంగా ఈ ఇద్దరు పలు వ్యక్తిగతంగానే గాక జట్టుగా కూడా కొత్త రికార్డులు నమోదు చేశారు.

కేకేఆర్ తో మ్యాచ్ లో డికాక్.. 70 బంతుల్లోనే 140 పరుగులు చేయగా.. రాహుల్ 51 బంతుల్లో 68 పరుగులు చేశారు. ఇద్దరూ అజేయంగా నిలిచారు. కాగా.. ఈ మ్యాచ్ లో డికాక్-రాహుల్ సాధించిన ఘనతలేంటో ఇక్కడ చూద్దాం.

అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం..

ఐపీఎల్ చరిత్రలో డికాక్-రాహుల్ లు నెలకొల్పిన ఓపెనింగ్ భాగస్వామ్యం 210 పరుగులు. అది కూడా అజేయంగా.. ఈ జాబితాలో ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో-డేవిడ్ వార్నర్ లు అగ్రస్థానంలో ఉన్నారు. 2019లో ఈ జంట 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు గౌతం గంభీర్-క్రిస్ లిస్ లు 2017 లో.. 184 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. 

కేకేఆర్ పై అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్.. 

కేకేఆర్ పై రాహుల్-డికాక్ లు 210 పరుగులు జోడించారు. అంతకుముందు 2012 లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ-హెర్షలీ గిబ్స్ లు 167 పరుగుల (రెండో వికెట్ కు ) భాగస్వామ్యాన్ని జోడించారు. 2017 లో డేవిడ్ వార్నర్- శిఖర్ ధావన్ లు తొలి వికెట్ కు 139 పరుగులు జతచేశారు.

ఏ వికెట్ కైనా హయ్యస్ట్ పార్ట్నర్షిప్.. 

- 229.. కోహ్లి - డివిలియర్స్.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ (2016) 
- 215.. కోహ్లి - డివిలియర్స్.. ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015) 
- 210.. డికాక్-రాహుల్.. లక్నో వర్సెస్ కేకేఆర్ (2022)

ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.. 

ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడమే గాక ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన డికాక్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ ముందున్నాడు. 

- 175 నాటౌట్.. క్రిస్ గేల్.. ఆర్సీబీ వర్సెస్ పూణె (2013) 
- 158 నాటౌట్.. బ్రెండన్ మెక్ కల్లమ్.. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ (2008) 
- 140 నాటౌట్.. క్వింటన్ డికాక్.. లక్నో వర్సెస్ కేకేఆర్ (2022) 
- 133 నాటౌట్.. ఏబీ డివిలియర్స్.. ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015) 
- 132 నాటౌట్.. కెఎల్ రాహుల్.. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ (2020) 

రాహుల్.. నిలకడకు మారు పేరు.. 

లక్నో సారథి కెఎల్ రాహుల్ వరుసగా ఐదో ఏడాది కూడా 500 ప్లస్ పరుగులు చేశాడు. ఇలా సాధించిన వారిలో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ వార్నర్ (6) తొలి స్థానంలో ఉన్నాడు. విరాట్, శిఖర్ లు కూడా ఐదు సార్లు 500 ప్లస్ స్కోర్లు చేశారు. 

Scroll to load tweet…

మరికొన్ని.. 

- ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు వికెట్ కోల్పోకుండా 20 ఓవర్లు బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. 
- ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ డికాక్. 
- ఈ సీజన్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ (10) లు కొట్టిన బ్యాటర్ డికాక్. 
- ఐపీఎల్ లో ఓపెనర్లిద్దరి పరుగులు 500 ప్లస్ దాటడం ఇది రెండో సారి. 2021 లో రుతురాజ్ గైక్వాడ్-ఫాఫ్ డుప్లెసిస్ లు ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈసారి డికాక్ (502), రాహుల్ (537) పరుగులు సాధించారు.