IPL 2022 SRH vs RCB: ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు గత మ్యాచులలో మాదిరే నాసిరకం బౌలింగ్ తో తేలిపోయారు. పాటిదార్, డుప్లెసిస్ లు రాణించడంతో ఆర్సీబీ.. భారీ స్కోరు చేసింది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల తీరు మారలేదు. సీజన్ తొలి భాగంలో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టిన మన బౌలర్లు.. తర్వాత వరుసగా తేలిపోతున్నారు. గత మూడు మ్యాచులలో మాదిరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో కూడా నాసిరకం బౌలింగ్ ప్రదర్శనతో బ్యాటర్ల మీద అదనపు భారం మోపారు. మన బౌలర్ల వైఫల్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు.. 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 20 ఓవర్లలో 193 పరుగులు చేయాల్సి ఉంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఆర్సీబీకి తొలి ఓవర్ తొలి బంతికే భారీ షాక్ తగిలింది. జగదీష్ సుచిత్ వేసిన తొలి బంతిని.. విరాట్ కోహ్లి (0) కేన్ విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి మరోసారి గోల్డెన్ డకౌటయ్యాడు. కానీ కోహ్లి స్థానంలో వచ్చిన రజత్ పాటిదార్ (38 బంతుల్లో 48.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ (50 బంతుల్లో 73 నాటౌట్.. 8 ఫోర్లు, 2సిక్సర్లు) రెచ్చిపోయి ఆడాడు. 

కార్తీక్ త్యాగి వేసిన ఆరో ఓవర్లో డుప్లెసిస్ ఓ సిక్సర్, ఫోర్ బాదగా.. పాటిదార్ కూడా ఓ ఫోర్ కొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్లో.. డుప్లెసిస్ రెండు ఫోర్లు, సిక్సర్ బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఇదే జోరును కొనసాగించారు. కార్తీక్ త్యాగి వేసిన 12వ ఓవర్లో ఫోర్ కొట్టిన డూప్లెసిస్.. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అతడికి ఇది మూడో అర్థ శతకం. 

Scroll to load tweet…

రెండో వికెట్ కు వీళ్లిద్దరూ 105 పరుగులు జోడించిన తర్వాత.. మళ్లీ సుచితే ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన 13వ ఓవర్ రెండో బంతికి డీప్ మిడ్ వికెట్ వద్ద ఉన్న త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు పాటిదార్. 

పాటిదార్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ (23 బంతుల్లో 33.. 3ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సిక్సర్ తోనే ఖాతా తెరిచాడు. అయితే.. చివరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కాస్త కట్టడి చేశారు. ఫరూఖీ వేసిన 17వ ఓవర్లో 8 పరుగులే రాగా.. భువీ వేసిన 18వ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. కార్తీక్ త్యాగి వేసిన 19వ ఓవర్లో 11 పరుగులిచ్చి మ్యాక్సీని ఔట్ చేశాడు. కానీ ఫరూఖీ వేసిన 20వ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో దినేశ్ కార్తీర్ (8 బంతుల్లో 30 నాటౌట్. 1 ఫోర్, 4 సిక్సర్లు) 6, 6, 6, 4 తో మొత్తంగా 25 పరుగులు పిండుకున్నాడు. 

సన్ రైజర్స్ బౌలర్లలో సుచిత్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులివ్వడమే గాక వికెట్లు కూడా తీయలేకపోయాడు. ఉమ్రాన్ మాలిక్ ఎప్పటికలాగే భారీగా పరుగలిచ్చుకున్నాడు. ఫరూఖీ కాస్త ఫర్వాలేదనిపించినా వికెట్లైతే దక్కలేదు. కార్తీక్ త్యాగి మ్యాక్స్వెల్ ను ఔట్ చేశాడు. కానీ తొలుత భారీ పరుగులిచ్చాడు.