TATA IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ తో వాంఖేడే వేదికగా జరుగుతున్న మ్యాచ్  లో లక్నో సారథి కెఎల్ రాహుల్, దీపక్ హుడాలు కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది.  ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

వరుసగా మూడు మ్యాచుల్లో ఇచ్చిన విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. టాప్-3 బ్యాటర్లు ధాటిగా ఆడటంతో ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్, దీపక్ హుడాలు ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే కష్టపడాల్సిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (51 బంతుల్లో 77.. 4 ఫోర్లు, 5 సిక్సర్లు), క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23.. 3 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడారు. సకారియా వేసిన రెండో ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టాడు.

రాహుల్ కూడా లలిత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో 6, 4 తో డికాక్ ను అనుసరించాడు. అయితే ఠాకూర్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి డికాక్.. లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

రాహుల్-హుడా సూపర్ 

డికాక్ ఔటయ్యాక రాహుల్ కు దీపక్ హుడా (34 బంతుల్లో 52 .. 65 ఫోర్లు, 1 సిక్సర్) జతకలిశాడు. ఇద్దరూ కలిసి ఢిల్లీ బౌలర్లమీద ఆధిపత్యం చెలాయించారు. కుల్దీప్ వేసిన 8వ ఓవరలో చెరో ఫోర్ కొట్టిన ఇద్దరూ.. అతడే వేసిన పదో ఓవర్లో 4, 6 తో 16 పరుగులు పిండుకున్నారు. పది ఓవర్లకే స్కోరు 94 పరుగులకు చేరింది. 

సకారియా వేసిన 12వ ఓవర్లో హుడా, రాహుల్ లు బౌండరీ, సిక్సర్ బాది హాఫ్ సెంచరీకి దగ్గరయ్యారు. ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్.. సింగిల్ తీసి ఈ లీగ్ లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే హుడా కూడా సింగిల్ తీసుకుని 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అతడికి కూడా ఇది ఐపీఎల్-15లో మూడో అర్థ శతకం. కానీ శార్దూల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్ మూడో బంతికి అతడికే క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 99 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

Scroll to load tweet…

స్టోయినిస్ దూకుడు..

హాఫ్ సెంచరీ తర్వాత రాహుల్ మరింత జోరు పెంచాడు. స్టోయినిస్ (17 నాటౌట్) తో కలిసి లక్నో స్కోరును మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి భారీ షాట్లు ఆడారు. ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో మూడో బంతికి సిక్సర్ కొట్టిన రాహుల్.. నాలుగో బంతికి లలిత్ యాదవ్ కు చిక్కాడు. ఇక ఆఖరి ఓవర్లో.. స్టోయినిస్ ఓ సిక్సర్ తో పాటు రెండు వైడ్లతో 15 పరగులొచ్చాయి.

ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపుతారనుకున్న కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు పెద్దగా ఆకట్టుకోలేదు. చేతన్ సకారియా భారీగా పరగులిచ్చాడు.