డిఫెండింగ్ ఛాంపియన్‌పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... రాణించిన అజింకా రహానే!  లసిత్ మలింగ రికార్డు సమం చేసిన బ్రావో... 

ఐపీఎల్ 2022 సీజన్‌ ఓపెనర్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. గత సీజన్ ఫైనల్‌లో సీఎస్‌కే చేతుల్లో ఓడిన కేకేఆర్, ఐపీఎల్ 2022 మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. సీఎస్‌కే విధించిన 132 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఈజీగా ఛేదించింది కేకేఆర్...

అజింకా రహానే, వెంకటేశ్ అయ్యర్ కలిసి తొలి వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 16 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, బ్రావో బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన నితీశ్ రాణా కూడా బ్రావో బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన అజింకా రహానే, ఐపీఎల్‌లో చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు...

మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి రహానే అవుటైనా... కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్ కలిసి కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చారు. 22 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్‌ను అవుట్ చేసిన బ్రావో... ఇన్నింగ్స్‌లో మూడో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు...

ఐపీఎల్‌లో 170 వికెట్లు పూర్తి చేసుకున్న బ్రావో, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లసిత్ మలింగ రికార్డును సమం చేశాడు. 166 ఐపీఎల్ వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, 157 వికెట్లు తీసిన పియూష్ చావ్లా... ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని విషయం తెలిసిందే. 

శ్రేయాస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులు చేసి బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. బ్యాటింగ్ మొదలెట్టిన సీఎస్‌కేకి తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ ఇచ్చాడు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్...

నో బాల్‌తో ఐపీఎల్ 2022 సీజన్‌ను ప్రారంభించిన ఉమేశ్ యాదవ్, తొలి ఓవర్‌ మూడో బంతికే రుతురాజ్ గైక్వాడ్‌ను డకౌట్ చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రుతురాజ్ గైక్వాడ్న... 20 ఇన్నింగ్స్‌ల తర్వాత డకౌట్ అయ్యాడు...

తొలి ఓవర్‌లో ఓ నో బాల్, రెండు వైడ్లతో 3 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చిన ఉమేశ్ యాదవ్.,.. బ్యాటర్‌కి పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. శివమ్ మావి ఓవర్‌లో ఫోర్, ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రాబిన్ ఊతప్ప... ఐపీఎల్ 2022 సీజన్‌లో మొట్టమొదటి బౌండరీలు నమోదుచేసిన బ్యాటర్‌గా నిలిచాడు...

8 బంతుల్లో 3 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఐదో ఓవర్ తొలి బంతికే శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు ఉమేశ్ యాదవ్.

ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రాబిన్ ఊతప్ప స్టంపౌట్ అయ్యాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, షెల్డన్ జాక్సన్ మెరుపు వికెట్ కీపింగ్‌ కారణంగా అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాతి ఓవర్‌లో అంబటి రాయుడు కూడా రనౌట్ అయ్యాడు. 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన అంబటి రాయుడు రనౌట్ కావడంతో 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసుకుని పెవిలియన్ చేరాడు అంబటి రాయుడు. 

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు రనౌట్ అయిన ప్లేయర్‌గా సురేష్ రైనాతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు అంబటి రాయుడు. శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్ 16 సార్లు రనౌట్ కాగా, రైనా, అంబటి రాయుడు 15 సార్లు రనౌట్ అయ్యారు. ఆ తర్వాత శివమ్ దూబే కూడా ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే... 

6 బంతుల్లో 3 పరుగులు చేసిన శివమ్ దూబే, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా ఇద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో 17 ఓవర్లు ముగిసే సమయానికి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది సీఎస్‌కే. ఆండ్రే రస్సెల్ వేసిన 18వ ఓవర్‌లో 3 ఫోర్లతో 14 పరుగులు రాబట్టిన ఎమ్మెస్ ధోనీ, శివమ్ మావి వేసిన 19వ ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు...

రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది, కెరీర్‌లో 29వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఎమ్మెస్ ధోనీ. 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మహీ 50 పరుగులు చేయగా, కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజా మాత్రం జిడ్డు బ్యాటింగ్‌తో 28 బంతుల్లో26 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు.

మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా కలిసి ఆరో వికెట్‌కి 56 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం జోడించారు.