TATA IPL 2022 KKR vs RR:టీమిండియా వెటరన్, ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఆ జట్టుకు స్పిన్ కోచ్ గా మారాడు. జట్టులో కుర్రాళ్లకు అశ్విన్ స్పిన్ పాఠాలు చెబుతున్నాడు.
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ జట్టుకు స్పిన్ కోచ్ అవతారమెత్తాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లను స్పిన్ ఉచ్చులో బంధించేందుకు ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, అశ్విన్ ఉండగా ఇప్పుడు తాజాగా వారికి యువ ఆటగాడు కూడా జతకలిశాడు. సోమవారం రాత్రి రాజస్తాన్.. కేకేఆర్ ను ఢీకొననున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్.. ఆ జట్టు ఆటగాడు రియాన్ పరాగ్ కు స్పిన్ పాఠాలు బోధిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్బంగా అశ్విన్.. పరాగ్ కు కోచ్ గా మారాడు.
ఈ మేరకు రాజస్తాన్ రాయల్స్ ట్విటర్ లో ఓ వీడియో ను పోస్ట్ చేసింది. వీడియోలో అశ్విన్.. పరాగ్ కు క్యారమ్ బాల్ ఎలా వేయాలి..? వికెట్ల లోపలికి దూసుకొచ్చే బంతిని ఎలా సంధించాలి..? వికెట్ల వెనుక నుంచి మెలికలు తిరిగే బంతిని ఎలా వేయాలి..? అనేదానిమీద టిప్స్ చెప్పాడు.
టిప్ప్ చెప్పడమే గాక స్వయంగా పరాగ్ తో అతడు చెప్పిన టిప్స్ ను సరిగ్గా అమలు చేసేలా చూశాడు. పరాగ్ ను మోకాలి మీద కూర్చోబెట్టి మరీ ఈ టిప్స్ ను చెప్పాడు అశ్విన్. బంతిని పట్టుకుని లైన్ అండ్ లెంగ్త్ తో ఎలా బౌలింగ్ చేయాలి..? అనేదానిపై కూడా పరాగ్ కు సూచనలిచ్చాడు.
ఈ సీజన్ లో రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేననే విజయం వరించింది. ఈ మ్యాచ్ లో జోస్ బట్లర్ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 19.4 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరోన్ ఫించ్ (58), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (85) రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో కేకేఆర్ పరాజయం పాలైంది.
ఇక ఈ మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహల్.. 5 వికెట్లతో చెలరేగాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చాహల్.. తొలి బంతికి వెంకటేశ్ అయ్యర్ ను ఔట్ చేయగా.. నాలుగో బంతికి శ్రేయస్ ను, ఐదో బంతికి శివమ్ మావిని, ఆరో బంతికి ప్యాట్ కమిన్స్ ను పెవిలియన్ కు పంపాడు. హ్యాట్రిక్ తో పాటు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి కేకేఆర్ వెన్ను విరిచాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ కూడా ప్రమాదకర ఆండ్రీ రసెల్ ను డకౌట్ చేశాడు. మరి సోమవారం జరుగబోయే మ్యాచ్ లో ఈ ఇద్దరితో పాటు పరాగ్ కూడా జతకలిస్తే కేకేఆర్ కు కష్టాలు తప్పవు.
