IPL2022 Rules Change: ఈ నెల 26 నుంచి మహారాష్ట్ర వేదికగా మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్ కోసం.. ఐపీఎల్ నియమావళిలో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. తాజా నిబంధనల ప్రకారం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు మరో పది రోజులు మాత్రమే మిగిలుంది. మార్చి 26 నుంచి మహారాష్ట్ర వేదికగా ఈ లీగ్ మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో లీగ్ నిర్వహించే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ నియమావళిలో రెండు కీలక మార్పులు చేసింది. కొవిడ్, డీఆర్ఎస్ కు సంబంధించి బీసీసీఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీంతో పాటు ఇటీవలే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలను కూడా ఐపీఎల్ లో ప్రవేశపెట్టనుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా జట్టులోని సభ్యులు కొవిడ్-19 బారిన పడి మ్యాచ్ కు 12 మంది ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు బీసీసీఐ ఆ మ్యాచును రీషెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లేదా అదీ సాధ్యం కాకుంటే ఈ విషయాన్ని ఐపీఎల్ సాంకేతిక కమిటీకి సూచిస్తుంది. ఆ కమిటీనే మ్యాచ్ నిర్వహణ పై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.. ‘ఆడుతున్న జట్టులో 12 మంది కంటే తక్కువ మంది ఆటగాళ్లు (వీరిలో ఏడుగురు భారతీయులు తప్పనిసరిగా ఉండాలి) ఉన్న సమయంలో ఆ జట్టుకు సంబంధించిన మ్యాచ్ ను రీషెడ్యూల్ చేస్తాం. ఒకవేళ ఇదీ సాధ్యం కాకుంటే ప్రత్యర్థి జట్టుకు 2 పాయింట్లు అందజేయడం జరుగుతుంది..’ అని తెలిపింది.
గతేడాది ఐపీఎల్ లో కరోనా సందర్భంగా సీజన్ ను అర్థాంతరంగా ఆపేసి తిరిగి దుబాయ్ లో రెండో దశను జరిపించింది. ఈ సందర్భంగా షెడ్యూల్ ను మొత్తం రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తో ఏదైనా జట్టు మ్యాచ్ ఆడలేని స్థితిలో ఉంటే ఆ జట్టుకు సంబంధించిన మ్యాచ్ రీషెడ్యూల్ చేయడమా..? లేక ప్రత్యర్థి జట్టుకు రెండు మ్యాచ్ పాయింట్లు ఇవ్వడమా అనే విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ కమిటీ చూసుకుంటుంది. దీనిపై ఆ కమిటీదే తుది నిర్ణయం.
ఇక దీనితో పాటు డీఆర్ఎస్ విషయంలో కూడా బీసీసీఐ నియమావళిని మార్చింది. ప్రతి ఇన్నింగ్స్ లో ఒక్కో జట్టు ఒక్కో సమీక్ష కోరే వీలు మాత్రమే ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. దీంతో ఒక్కోజట్టు ఇన్నింగ్స్ లో రెండు రివ్యూలను ఉపయోగించుకోవచ్చు.
ఎంసీసీ తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఎవరైనా బ్యాటర్ క్యాచ్ అవుట్ ద్వారా నిష్క్రమించినప్పుడు క్రీజులోకి కొత్తగా వచ్చే బ్యాటర్ స్ట్రైకింగ్ కే వెళ్లాలి. గతంలో ఇది నాన్ స్ట్రైక్ వైపునకు ఉండేది. ఈ నిబంధనను ఎంసీసీ ఇటీవలే తీసుకొచ్చింది.
ఇక ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ వంటి కీలక మ్యాచులలో ఫలితం తేలకుండా టై గా అయితే.. అప్పుడు నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా వీలుకాకుంటే లీగ్ స్టేజ్ లో పాయింట్ల ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.
