ఐపీఎల్ 14వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై జట్టు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో 45 పరుగుల తేడాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్ జోస్ బట్లర్ (49) పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగారు.

ఈ మ్యాచ్ విజయం తర్వాత.. ధోనీ మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ధోనీ తన వయసు ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. వయసు పెరుగుతున్నా.. ఫిట్ గా ఉంటూ.. యువ క్రికెటర్లతో పోటీ పడటం అనేది చాలా కష్టమైన విషయంగా ధోనీ పేర్కొన్నాడు.

ధోనీ వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు కాగా... కొంత కాలం క్రితం ధోనీ అంతర్జాతీయ మ్యాచులకు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో.. ధోనీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ‘ వయసు పెరుగుతూ.. ఫిట్ గా ఉండటం.. ఈ రెండు విషయాలు చాలా కష్టమైనవి’ అని ధోనీ పేర్కొన్నాడు.

‘ మీరు ఆడుతున్న సమయంలో.. మిమ్మల్ని ఎవరూ అన్ ఫిట్ అని చెప్పడం మీకు ఇష్టం లేకపోతే.. యువ క్రికెటర్లతో పోటీపడక తప్పదు. నేను కూడా అదే చేస్తున్నా. ఎందుకంటే యువ క్రికెటర్లు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్లను ఛాలెంజ్ చేయడం బాగుంటుంది’ అని ధోనీ పేర్కొన్నాడు.

‘నాకు 24ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా ఫర్ఫార్మెన్స్ మీద నేను గ్యారెంటీ ఇవ్వగలను. కానీ అదే గ్యారెంటీ 40ఏళ్ల వచ్చాక ఇవ్వలేను కదా. అలా అని.. నేను అనర్హుడని ఎవరూ వేలెత్తి చూపించడం లేదు.. అదే పెద్ద పాజిటివ్ విషయం నాకు’ అని ధోనీ పేర్కొన్నాడు.

ధోనీ వయసు విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి. కాగా.. ఇలా వయసు గురించి ప్రస్తావన తేవడం అభిమానులలో సైతం తీవ్ర చర్చనీయాంశమైంది.