ఐపీఎల్ నిర్వహణపై నెలకొన్న సందిగ్థతకు తెరపడింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ 14 మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై శనివారం అధికారిక ప్రకటన చేసింది బోర్డ్. కరోనా సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించిన యూఈఏ వేదికగా 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి. దీని వల్ల బీసీసీఐకి ఖర్చు తక్కువ అవుతుంది, ఆదాయం భారీగా వస్తుంది. ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తున్న టీమిండియా, సెప్టెంబర్ 14న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ముగించుకుంటుంది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్‌ సెకండాఫ్‌ను యూఏఈ వేదికగా ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ.

ఇందుకోసం రెండో, మూడో టెస్టు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఈసీబీని కోరినట్టు సమాచారం. రెండో టెస్టు ఆగస్టు 16న ముగిస్తే, మూడో టెస్టు 25న ప్రారంభం అవుతోంది. అంటే మధ్యలో 8 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను 4 రోజులకు తగ్గిస్తే, ఐదో టెస్టు 4 రోజులు ముందుగానే ముగుస్తుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 20 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌ను ముగించాలని భావిస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఇందులో 10 డబుల్ హెడెడ్ మ్యాచులు, 7 సింగిల్ డే మ్యాచులు, 4 ఫ్లేఆఫ్స్ ఉంటాయి.

Also Read:ఐపీఎల్ సెకండ్ పేజ్ కోసం వేదికను ఖరారు చేసిన బీసీసీఐ, అందుకోసం ఆ సిరీస్ లు కూడా రద్దు

సీజన్‌ను త్వరగా ముగించేందుకు సింగిల్ మ్యాచ్‌లను తగ్గించి, డబుల్ హెడెడ్ మ్యాచులను పెంచాలని భావిస్తోంది బీసీసీఐ. నేరుగా ఇంగ్లాండ్ బయో బబుల్ నుంచి ఐపీఎల్ బయో బబుల్‌లో చేరేలా యూఏఈ ప్రభుత్వాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. లేదా ఆటగాళ్లు ఆరు రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు. అయితే ఐపీఎల్ సెకండాఫ్‌ను ముగించేందుకు ఈ రెండు సిరీస్‌లను రద్దు చేయాలని చూస్తోంది బీసీసీఐ.