చెన్నై: ఐపిఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తొలి మ్యాచు జరగబోతున్న తరుణంలో విరాట్ కోహ్లీ సేనకు భారీ దెబ్బ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీపీ) ఆల్ రౌండర్ డేనియల్ శామ్స్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.  విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో సామ్స్ కు నెగెటివ్ వచ్చిందని, అయితే ఈ రోజు చేసిన పరీక్షల్లో అతనికి పాజిటివ్ ఉన్నట్లు తేలిందని ఆర్సీబీ యాజమాన్యం తెలిపింది. దాంతో చెన్నైలోని హోటల్ గదిలో ఏర్పాటు చేిసన ఐసోలేషన్ లో ఉంటూ సామ్స్ చికిత్స పొందుతున్నాడని చెప్పింది. సామ్స్ కు కరోనా నిర్ధారణ కావడంతో జట్టులోని మిగతా ఆటగాళ్లకు మరోసారి కోవిడ్ టెస్టు చేయనున్నట్లు ఆర్సీపీ తెలిపింది. 

ఇప్పటికే ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా సామ్స్ కరోనా బారిన పడడంతో ఆర్సీబీలో గుబులు ప్రారంభమైంది. ఐపిఎల్ 2021 సీజన్ లో తొలి మ్యాచ్ 9వ తేదీన చెన్నైలోని చేపాక్ వేదికగా ముంబై ఇండియన్స్ మీద జరగనుంది. 

కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అక్షర్ పటేల కరోనా బారిన పడ్డారు. వారంతా ఐసోలేషన్ లో ఉన్నారు.