ఐపీఎల్ 2021 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి బోణి కొట్టింది. తొలి మ్యాచ్ గెలవడం పట్ల ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. తన సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు. నిన్నటి మ్యాచ్ ధోనీకి ఐపీఎల్ లో 200వ మ్యాచ్ కావడం విశేషం.

ఈ విషయంపై కూడా ధోనీ స్పందించాడు. ‘నాది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. భిన్న పరిస్థితులు, వేర్వేరు దేశాల్లో ఆడాను. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. పాత అనుభూతుల్ని గుర్తుకు తెస్తుంది(నవ్వుతూ).  నా ఐపీఎల్‌ జర్నీతో ఆనందంగా ఉన్నా’ అని తెలిపాడు.

‘గతంలో చెన్నై వికెట్‌ చాలా బాగుండేది. నాకు తెలిసి 2011లో చెన్నై వికెట్‌ చాలా బాగుంది. ఆ తర్వాత ఆ వికెట్‌తో మేము హ్యాపీగా లేము. దాన్ని పూర్వపు స్థితికి తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నించారు. అయినా ఆ వికెట్‌లో ఎటువంటి మార్పులేదు. ఆ వికెట్‌పై బ్యాట్‌పై బంతికి సరిగా రాదు. అక్కడ భారీ షాట్లు ఆడాలంటే చాలా కష్టం’ అని తెలిపాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేయడాన్ని కొనియాడాడు. చాహర్‌ డెత్‌ ఓవర్ల బౌలర్‌గా చాలా మెరగయ్యాడు.

‘‘నేను అతని చేతికి బంతి ఇచ్చిన ప్రతీసారి అందుకు న్యాయం చేస్తాడు. నేను అనుకున్న దాని కంటే పిచ్‌ను అర్థం చేసుకుని మరీ బౌలింగ్‌ చేస్తాడు. నేను ఎటాకింగ్‌ కోసం చూశాను కాబట్టి అతని చేత వరుసగా నాలుగు ఓవర్లు వేయించాను. మాకు ఉన్న బౌలింగ్‌ వనరులు కారణంగా చాహర్‌ చేత వరుసగా నాలుగు ఓవర్లు వేయించాను. ఇలా వరుసగా నాలుగు ఓవర్లు వేయించాలన్నా కూడా అతను ఫిట్‌గా ఉండాలి. అలా బౌలింగ్‌ చేయించడంతో చాహర్‌ మరింత ఫిట్‌ అవుతాడు. మేము మొయిన్‌ అలీ బ్యాట్‌ నుంచి భారీగానే ఆశిస్తున్నాము. ఆలీ ఆరంభంలో మెరుగ్గా ఆడితే మాకున్న మిగతా బ్యాటింగ్‌ వనరులను బాగా సద్వినియోగం చేసుకోగలము’ అని ధోని తెలిపాడు.