చెన్నై: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ మీద టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్స్ వెల్ ఏ ఐపిఎల్ లోనూ నిలకడగా ఆడలేదని, అందుకే అతను లీగ్ లో అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించాడు. ఈఎస్పీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఆ వ్యాఖ్యలు చేశాడు. 

ఆర్సీబీ అతనిపై చాలా ఆశలు పెట్టుకుందని, కానీ మాక్స్ వెల్ వారికి నిరాశ కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు. గత సీజన్ లో పంజాబ్ తరఫున ఆడిన మ్యాచుల్లో కేవలం 108 పరుగులు చేశాడని, అతనిపై ఆశలు పెట్టుకోవడం వృధా అని ఆయన అన్నాడు. అతని వల్ల విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని అన్నాడు. 

వాస్తవానికి ఏ ఐపిఎల్ సీజన్ లో కూడా మాక్స్ వెల్ సంతృప్తికరమైన ప్రదర్శన చేయలేదని, ప్రతిీ సీజన్ లో అతను ఆడుతున్నాడని చాలా మంది పొరపడుతున్నారని, నిజానికి అతని ఆటలో నిలకడ లేదని, అందుకే అన్ని ఫ్రాంచేజీలు తిరిగి వస్తున్నాడని, ఒక్క 2014 సీజన్ లో తప్ప ఇతర సీజన్ లో అతను రాణించడం తాను చూడలేదని గంభీర అన్నారు .
మాక్స్ వెల్ ఆస్ట్రేలియా జట్టుతో పాటు అక్కడ లీగ్ మ్యాచుల్లో మాత్రమే ఆడుతాడు తప్ప ఐపిఎల్ లో అతనిపై కోట్ల వర్షం కురిపించినా ఆడబోడని, ఆ విషయం తెలియక మాక్సీని ఆర్సీబీ రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసిందని ఆయన అన్నాడు. మ్యాక్సీ తరహాలో విధ్వంసకరమైన ఆటగాడు ఆండ్రీ రసెల్ మాత్రం కేకేఆర్ లో మాత్రమే కొనసాగుతున్నాడని చెప్పాడు. 

రసెల్ ప్రతి సీజన్ లో స్థిరమైన ప్రదర్సనను కనబరుస్తున్నట్లు గంభీర్ అభిప్రాయపడ్డాడు. అందేకే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేయడం లేదని, కనీసం ఈ సీజన్ లోనైనా మ్యాక్సీ ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తాడని ఆశిస్తున్నానని ఆయన అన్నాడు.