ఐపీఎల్ 14వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై జట్టు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో 45 పరుగుల తేడాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్ జోస్ బట్లర్ (49) పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగారు.

దీంతో.. విజయం చెన్నై సూపర్ కింగ్స్ కి దక్కింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఒకానొక సమయంలో ధోనీ రనౌట్ అయ్యే ప్రమాదంలో పడ్డాడు. కానీ.. తన తెలివితో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

 

14 ఓవర్‌ చివరి బంతికి క్రీజ్‌లోకి వచ్చిన ధోని..  15 ఓవర్‌ రెండో బంతికి రనౌట్‌ అయ్యే అవకాశాన్ని తృటిలో తప్పించుకున్నాడు.  రాహుల్‌ తెవాతియా వేసిన బంతిని కవర్స్‌లోకి ఫ్లిక్‌ చేసి సింగిల్‌కి యత్నించాడు.

అయితే జడేజా సింగిల్‌ వద్దని గట్టిగా అరిచాడు. అ‍ప్పటికే క్రీజ్‌ను వదిలి చాలా దూరం ముందుకు వచ్చేసిన ధోని.. జడేజా కాల్‌తో వెనక్కి మళ్లాడు. అంతేవేగంగా కవర్స్‌లో ఉన్న ఫీల్డర్‌.. కీపర్‌  సామ్సన్‌కు మెరుపువేగంతో బంతిని అందించాడు. అంతే ఒక్క ఉదుటన డైవ్‌ కొట్టిన ధోని కొద్దిపాటిలో రనౌట్‌ నుంచి తప్పించుకున్నాడు. ఇలా ధోని డైవ్‌ కొట్టి బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టడంతో దటీజ్‌ బాస్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కీపర్‌ టూ కీపర్‌ పోరులోనైనా, కీపర్‌ టూ బ్యాట్స్‌మన్‌ పోరులో నైనా ధోనినే బెస్ట్‌ కదా అని కొనియాడుతున్నారు. సామ్సన్‌.. అక్కడ ఉంది మీ అందరికీ బాస్‌ ధోని అంటూ కామెంట్లు చేస్తున్నారు.