న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి జరిిన ఐపిఎల్ ట్వంటీ20 రెండో క్వాలిఫయిర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటిల్స్ సన్ రైజర్స్ హైదరాబాదు మీద 17 పరుగుల తేడాతో విజయం సాధించి పైనల్ కు చేరుకుంది. ఈ విజయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించాడు. ధావన్ 78 పరుగులు చేసి చివరి ఓవరులో అవుటయ్యాడు. 

సందీప్ శర్మ వేసిన 19వ ఓవరు మూడో బంతికి ధావన్ ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరుకున్నాడు. అయితే, అంపైర్ ఔట్ ఇవ్వక ముందే అతను క్రీజు వదిలినట్లు కనిపించింది. రీప్లేలో సందీప్ శర్మ వేసిన బంతి ఆఫ్ స్టంప్ అవతలికి వెళ్లినట్లు తేలింది. 

కాగా, ధావన్ కనీసం డీఆర్ఎస్ కు వెళ్లకపోవడం పట్ల భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అందుకు శిఖర్ ధావన్ ను ఆయన ట్రోల్ చేశాడు. ఢిల్లీ ఇన్నింగ్సు చివరి రెండు ఓవర్లలో హైదరాబాదు బౌలర్లు అద్భతంగా బంతులు వేశారని అంటూ సందీప్, నటరాజన్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదని ప్రశంసించాడు. 

శిఖర్ ధావన్ అద్భుతంగా ప్రదర్శన చేశాడని అంటూనే అతన్ని ట్రోల్ చేశాడు. ఎప్పటిలాగే డీఆర్ఎస్ కోరడం శిఖర్ ధావన్ మరిచిపోయాడని అన్నాడు. 

అయితే, సన్ రైజర్స్ హైదరాబాదు 17 ఓవర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించే విధంగానే కనిపించింది. స్టోయినిస్, రబడ కీలకమైన సమయంలో వికెట్లు తీశారు. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్ వరుసగా అవుటయ్యారు. దాంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి ఓటమి పాలైంది.