దుబాయ్: రాజస్తాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియాపై భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ప్రశంసల జల్లు కురిపించాడు. అతనికి అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ ను సైతం తయారు చేయగలడని ఆయన అన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తో శనివారం జరిగిన మ్యాచులో తెవాటియా అద్భుతమైన ప్రతిభను కనబరించాడు. 

రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ను జారవిడుచుకున్నప్పటికీ తెవాటియా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ చివరలో బ్యాటింగ్ కు దిగిన తెవాటియా 11 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఆ తర్వాత బౌలింగులో పడిక్కల్ వికెట్ తీశాడు. అంతే కాకుండా, బౌండరీ వద్ద అతను పట్టిన క్యాచ్ అద్భుతంగా నిలిచింది. తన సూపర్ క్యాచ్ తో విరాట్ కోహ్లీని పెవిలియన్ కు పంపించాడు. 

కార్తిక్ త్యాగి బౌలింగులో విరాట్ కోహ్లీ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బంతి దాదాపుగా సిక్స్ గా వెళ్లింది. అయితే, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న తెవాటియా పరుగెత్తుకంటూ వెళ్లి బంతిని అబ్బురపరిచే విధంగా పట్టుకున్నాడు. పట్టు తప్పి తాను బౌండరీ దాటుతున్నట్లు గ్రహించి బంతిని బౌండరీ ఇవతలికి విసిరేసి, ఇవతలికి వచ్చి గాలిలో బంతిని అందుకున్నాడు. ఇదంతా కొద్ది సేపట్లోనే జరిగిపోయింది. 

ఆ క్యాచ్ కు వీరేంద్ర సెహ్వాగ్ మురిసిపోయాడు. దాంతో రాహుల్ తెవాటియాను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. తెవాటియా ఏమైనా చేయగలడని, చివరకి తనకు అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ ను కూడా తయారు చేయగలడని, అద్భుతమైన క్యాచ్ అంటూ ఆయన ప్రశంసించాడు. దాన్ని సెహ్వాగ్ హిందీలో ట్వీట్ చేశాడు. తెవాటియా పట్టిన క్యాచ్ ను దానికి జత చేశాడు.