న్యూఢిల్లీ: ఐపిఎఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ మీద భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశాడు. మాక్స్ వెల్ ను ఆయన పది కోట్ల చీర్ లీడర్ అని అన్నాడు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్టు చేశాడు. ఐపిఎల్ లో మాక్స్ వెల్ సరైన ప్రదర్శన చేయకపోవడంపై ఆ వ్యాఖ్యలు చేశాడు.

మాక్స్ వెల్ పంజాబ్ కు చాలా ఖరీదైన ఆటగాడని నిరూపించుకున్నాడని, గత కొద్ది సీజన్లలో అతను సరైన ప్రదర్శన చేయలేదని, ఈ సీజన్ లో అది తీవ్ర స్థాయికి చేరుకుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. దీన్ని భారీగా ఖర్చు పెట్టిన వెకేషన్ గా భావించవచ్చునని కూడా అన్నాడు. 

ఈ సీజన్ లో మాక్స్ వెల్ 13 మ్యాచులు ఆడి కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 15.42 ఉంది. కేవలం మూడు వికెట్లు తీసుకున్నాడు. 

అత్యంత ఖరీదైన మరో ఆటగాడు డెయిల్ స్టెయిన్ గా సరైన ప్రదర్శన చేయకపోవడాన్ని సెహ్వాగ్ ఎత్తిచూపాడు. స్టెయిన్ గన్ కు అందరూ భయపడే కాలం ఒకటి ఉండేదని, ఈ సీజన్ లో సరైన ప్రదర్శన చేయలేకపోయాడని, అతను ఈసారి ఇంట్లో తయారు చేసిన పైప్ గన్ గా మారాడని అన్నాడు. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన స్టెయిన్ మూడు మ్యాచులు ఆడాడు. ఓవరుకు 11.40 పరుగులు ఇచ్చుకున్నాడు. కేవలం ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఆర్సీబీ ఆటగాడు ఆరోన్ ఫించ్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్, కోల్ కతా నైట్ రైడర్స్ ఆండ్రే రసెల్ సరైన ప్రదర్శన చేయలేకపోయారని అన్నాడు. 

జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్, కెఎల్ రాహుల్, హార్డిక్ పాండ్యాలను హిట్ ప్లేయర్లుగా వీరేంద్ర సెహ్వాగ్ అభివర్ణించాడు.