చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా ఐపీఎల్ 2020 నుంచి అనూహ్యంగా నిష్క్రమించడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు నెట్ ప్రాక్టీస్‌తో మంచి ఊపు మీద కనిపించిన రైనా, దుబాయ్ వెళ్లిన కొద్దిరోజులకే భారత్‌కు తిరుగుముఖం పట్టాడు.

కోవిడ్ భయంతోనే రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కాదు కాదు వ్యక్తిగత కారణాలతోనే నిష్క్రమించాడని చెన్నై యాజమాన్యం చెప్పింది. ఈ క్రమంలో సీఎస్కే ఆటగాడు షేన్ వాట్సన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

రైనా నిష్క్రమణ చెన్నై జట్టుతో పాటు ఐపీఎల్‌కే పెద్ద లోటని అభిప్రాయపడ్డాడు. చెన్నై గుండె చప్పుడు రైనా అంటూ సోషల్ మీడియా వేదికగా వాట్సన్ ఓ వీడియో సందేశం ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read:దోపిడి దొంగల బీభత్సం: క్రికెటర్ సురేశ్ రైనా బంధువు మృతి

ఆదివారం పొద్దున ఓ చేదు వార్తను వినాల్సి  వచ్చిందని... ఐపీఎల్ టోర్నీ నుంచి సురేశ్ రైనా వైదొలగడం బాధించిందని వాట్సన్ అన్నాడు. అతను చెన్నైతో పాటు ఐపీఎల్ టోర్నీలోనే రైనా ఎంతో విలువైన ఆటగాడని అభివర్ణించాడు.

వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నా, ఆయనకు, కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని వాట్సాన్ తెలిపాడు. జట్టు సభ్యులంతా నిన్ను ఎంతో మిస్ అవుతున్నామని వాట్సాన్ పేర్కొన్నాడు.

కాగా రైనా మేనత్త భర్త అశోక్ కుమార్ ఆగస్టు 19న పంజాబ్‌లోని పఠాన్ కోట్ సమీపంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారణంగానే సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని తొలుత వార్తలు వినిపించాయి.