దోపిడీ దొంగల కారణంగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దొంగల చేతిలో రైనా బంధువు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే... పంజాబ్‌లోని పఠాన్ కోట్ జిల్లా థరియాల్ గ్రామంలో ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాసిస్తున్నారు.

ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో ముగ్గురు, నలుగురు దోపిడీ దొంగలు వీరి ఇంట్లో చొరబడ్డారు. ఈ సమయంలో అశోక్ కుమార్ కుటుంబసభ్యులంతా డాబాపై నిద్రిస్తున్నారు.

దొంగతనానికి వచ్చిన వారు కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ సమయంలో అశోక్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన తల్లి సత్యదేవి, భార్య ఆశాదేవి, కుమారులు అపిన్, కౌశల్ గాయపడ్డారు.

తీవ్రగాయాలపాలైన వీరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అశోక్ మరణించగా.. సత్యదేవి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

కొంత నగదు, బంగారం దొంగిలించుకుపోయారని దుండగుల కోసం గాలిస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్‌ తెలిపారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడేందుకు యూఏఈ వెళ్లిన రైనా.. భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. రైనా ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆడటం లేదని ఆ జట్టు సీఈవో ట్వీట్ చేశారు.