షార్జా: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీని ఐపిఎల్ లో ఏడు సార్లు ఔట్ చేసిన ఘతనను సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సాధించాడు. శనివారంనాడు జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశ పరుస్తూ అతి తక్కువ వ్యక్తిగత స్కోరుకే సందీప్ శర్మ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. 

విరాట్ కోహ్లీ వికెట్ ను తీసుకోవడం తనకు ప్రత్యేకమైన ఫీలింగ్ ను కలిగిస్తుందని సందీప్ శర్మ అన్నాడు. సందీప్ శర్మను విరాట్ కోహ్లీ ఐపిఎల్ లో 12 ఇన్నింగ్సుల్లో ఎదుర్కున్నాడు. అతని బౌలింగులో కేవలం 68 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

శనివారంనాడు జరిగిన మ్యాచులోసందీప్ శర్మ వేసిన బంతిని విరాట్ కోహ్లీ షాట్ కొట్టాడు. అయితే, అది నేరుగా కేన్ విలియమన్స్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో విరాట్ కోహ్లీ శనివారంనాడు హైదరాబాదుపై జరిగిన మ్యాచులో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. 

ఐపిఎల్ లో ఎక్కువ సార్లు విరాట్ కోహ్లీని అవుట్ చేసిన ఘనతను సందీప్ శర్మ సాధించాడు. ఐపిఎల్ లో ఆశిష్ నెహ్రా విరాట్ కోహ్లీని ఆరు సార్లు అవుట్ చేశాడు. ఆ రికార్డును సమం చేసిన సందీప్ శర్మ శనివారంనాడు ఏడోసారి అవుట్ చేసి రికార్డు సాధించాడు. 

విరాట్ కోహ్లీని ఏడోసారి అవుట్ చేయడం ద్వారా సందీప్ శర్మ మరో ఘనత కూడా సాధించాడు. ఒక ఆటగాడిని అత్యధిక సార్లు అవుట్ చేసిన జహీర్ ఖాన్ రికార్డును సమం చేశాడు. జహీర్ ఖాన్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీని ఏడు సార్లు అవుట్ చేశాడు.