ఐపీఎల్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా తప్పుకోగా.. తాజాగా హర్భజన్ సైతం అదే బాటలో నడిచాడు.

దీనికి అదనంగా ఆటగాళ్లు కరోనా బారినపడటంతో సీఎస్కే‌ శిబిరంలో ఆందోళన నెలకొంది. కోవిడ్ కలకలం నేపథ్యంలో చెన్నై జట్టు ఇటీవలే హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లింది. అయితే ఆ గడువు శుక్రవారం ముగియడంతో సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా కలిసి అల్పాహారం తీసుకున్నారు.

ఈ సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌లు ఇద్దరు టేబుల్‌పై కూర్చొన్న ఫోటోను సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘‘ సీఎస్‌కే టీమ్ వాట్టో థాలా దర్శనమ్ (టిఫిన్ చేయడానికి సిద్ధం) అంటూ తమిళ భాషలో పోస్ట్ చేసింది.

కాగా రైనా నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్‌లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో జట్టు యజమాని శ్రీనివాసన్‌కు రైనాతో కొంత వివాదం నెలకొందని వార్తలు వచ్చాయి.

అయితే జట్టుతో కానీ, శ్రీనివాసన్‌తో కానీ తనకు ఎలాంటి వివాదాలు లేవని సురేశ్ రైనా పేర్కొన్నాడు. శ్రీనివాసన్ తనకు తండ్రి లాంటి వారని, ఆయన ఎన్నో అంశాల్లో అండగా నిలిచారని రైనా తెలిపాడు. కాగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది.