ఐపీఎల్ సందడి మొదలైంది. ఒక్కో జట్టు రెచ్చిపోయి మరీ ఆడుతోంది. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ దంచి కొట్టాడు. బెంగళూరు జట్టుపై పంజాబ్ జట్టు విజయం సాధించింది. కాగా... ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. 69 బంతుల్లోనే 132 పరుగులు చేసిన రాహుల్‌ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 

కాగా రికార్డుల రారాజు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ చరిత్రలో ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. తాజాగా ​సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును కేఎల్‌ రాహుల్‌ బ్రేక్‌ చేశాడు. ఐపీఎల్‌లో అతి వేగంగా 2వేల పరుగులు సాధించిన రికార్డు ఇప్పటివరకు సచిన్‌ పేరిట ఉంది. సచిన్‌కు ఐపీఎల్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడానికి 63 ఇన్నింగ్స్‌లు అవసరం పడ్డాయి. కాగా కేఎల్‌ రాహుల్‌ మాత్రం కేవలం 60 ఇన్నింగ్స్‌లోనే 2వేల పరుగులు సాధించాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ 22 పరుగులు వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో 206 పరుగులు చేసింది. 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ పూర్తిగా ఒత్తిడికి లోనై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మొత్తం ఓవర్లు ఆడకుండానే 17 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైన ఆర్‌సీబీ 97 పరుగులతో ఘోర పరాజయం పాలైంది. కాగా కింగ్స్‌ పంజాబ్‌ తన తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 1న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది