షార్జా: తమ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయంపై ముంబై ఇండియన్స్ కు చెందిన కీరోన్ పోలార్డ్ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. రోహిత్ శర్మ గాయం కారణంగా ఆడలేకపోవడంతో అతని స్థానంలో కీరోన్ పోలార్డ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటిల్స్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ లేని లోటు బాధించడం లేదు. 

రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా దిగుతున్న ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందు ఉంచిన 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

గాయం నుంచి రోహిత్ శర్మ కోలుకుని మైదానంలోకి దిగే విషయంపై ముంబై ఇండియన్స్ ఎదురు చూస్తోంది. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుంటున్నాడని మ్యాచ్ ముగిసిన తర్వాత కీరోన్ పోలార్డ్ చెప్పాడు. రోహిత్ శర్మ కోలుకుంటున్నాడని, తమకు కూడా ఉత్కంఠగానే ఉందని, అతను తిరిగి మైదానంలోకి దిగే సమయం కోసం నిరీక్షిస్తున్నామని, అతను గాయం నుంచి కోలుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడని, ఏమవుతుందో చూద్దామని పోలార్డ్ అన్నాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ మీద టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మెన్ ను అద్భుతంగా కట్టడి చేశారు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేసి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. 

బౌల్ట్ ప్రత్యేకమని, కొత్త బంతితో బౌలింగు చేయడంలో అది అతని బలమని, నిలకడగా మంచి ప్రారంభాన్ని ఇస్తున్నాడని పోలార్డ్ అన్నాడు. ఈ ట్రాక్ మీద యాంగిల్స్ కారణంగా బుమ్రాకు బంతి ఆలస్యంగా ఇస్తున్నానని,  పవర్ ప్లేలో బౌలింగు చేయడానికి ఇష్టపడుతున్నాడని, అయితే స్పిన్నర్లకు గ్రిప్ దొరుకుతున్నందున అతన్ని మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయించానని పోలార్డ్ అన్నాడు.

ఇషాన్ కిషన్ గురించి కూడా పోలార్డ్ మాట్లాడాడు. ప్రతి ఆటకు మరింతగా మెరగవుతున్నాడని ఆయన అన్నాడు.