న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కి, ముంబై ఇండియన్స్ కి మధ్య జరిగిన మ్యాచు ఫలితంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అబూ దబీలోని షేక్ జయేద్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో చెన్నై ముంబైని ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

అంబటి రాయుడు అద్భుతమైన బ్యాటింగ్ ను వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. ఫాఫ్ డూ ప్లెసిస్ తీసుకున్న రెండు కళ్లు చెదిరే క్యాచ్ లను కూడా ఆయన కొనియాడారు. అంబటి రాయుడు బ్యాటింగ్, ప్లెసిస్ క్యాచ్ లు చెన్నై విజయానికి కారణమయ్యాయని ఆయన అన్నారు.

See Video: ముంబై ని మట్టికరిపించిన ధోని సేన, మ్యాచులో మలుపులు ఇవే..

ఐపిఎల్ గొప్ప ప్రారంభమైందని ఆయన అన్నారు. రాయుడు, ప్లెసిస్ అద్భుతంగా ఆడారని, అయితే సామ్ కర్రాన్ బ్యాటింగ్ తో మ్యాచ్ తీరు మారిపోయిందని ఆయన అన్నారు. ఇడ్లీ పావ్ వడను ఓడించిందని వ్యాఖ్యానించారు. 

 

ఐపిఎల్ 2020లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన మ్యాచులో టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ ధాటిగానే ఇన్నింగ్సును ప్రారంభించారు. వారిద్దరు అవుటైన తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పేక మేడలా కూలుతూ వచ్చింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే ఎదురు దెబ్బ తింది. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన డుప్లెస్, అంబటి రాయుడు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో చెన్నై 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. 

చెన్నై 22వ తేదీన జరిగే మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ను, ముంబై ఇండియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఎదుర్కుంటాయి.