స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో పదేపదే అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మ్యచ్ ఫలితాన్నే ప్రభావితం చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీముఖ్యంగా సీనియర్ క్రికెటర్లకు బయపడి అంపైర్లు తప్పుడు నిర్ణయాలను ప్రకటిస్తున్నారని ఆరోపణతున్నాయి. ఇటీవల సీఎస్కె కెప్టెన్ ధోనికి భయపడి అంపైర్ వైడ్ ఇవ్వబోయి వెనక్కి తగ్గిన ఘటనే ఉదాహరణ చెబుతున్నారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లోనూ అలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకున్న అంపైర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆర్సిబి విసిరిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించే దిశగా ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో అంపైర్లు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 10వ ఓవర్ ఉదానా వేయగా విలియమ్సన్ క్రీజులో వున్నాడు. ఈ సమయంలో ఓ బంతిని బ్యాట్స్ మెన్ కు సమాన ఎత్తులో ఫుల్ టాస్ విసిరాడు బౌలర్. క్లియర్ గా అది నోబాల్ అని తెలుస్తున్నా అంపైర్లు మాత్రం దాన్ని సక్రమమైన బంతిగానే పరిగణించారు. ఈ నిర్ణయమే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. 

అంపైర్ల నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్, యువరాజ్ సింగ్ లతో పాటు న్యూజిలాండ్ ఆటగాడు నీషమ్ స్పందించారు. 

''ఇది ఐపిఎల్ లొ నో బాల్ కాదు'' అంటూ హర్భజన్ వ్యంగంగా ట్వీట్ చేశాడు. 

''ఆ బంతిని నో బాల్ గా ప్రకటించకపోవడాన్ని నేను నిజంగా నమ్మలేకపోయాను. సీరియస్ గా'' అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు. 

''ఇక బ్యాట్స్ మెన్ తలకంటే పైనుండి వెళితేనే నోబాల్??'' అంటూ న్యూజిలాండ్ క్రికెటర్ నీషమ్ అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు.