ప్లే ఆఫ్స్‌ చర్చలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చివరి మూడు మ్యాచుల్లో ఢిల్లీ, బెంగళూర్‌, ముంబయిలను ఓడించాల్సిన తరుణంలో ఆరెంజ్‌ ఆర్మీ అవకాశాలను సిరీయస్‌గా తీసుకోలేదు. కానీ సన్‌రైజర్స్‌ వరుసగా మూడు మ్యాచుల్లో ఢిల్లీ, బెంగళూర్‌, ముంబయిలను ఓడించింది. టాప్‌-3  ప్లేస్‌తో ప్లే ఆఫ్స్‌లో చోటు సాధించింది. 

ఇప్పుడు హైదరాబాద్‌ రెండో ఐపీఎల్‌ టైటిల్‌ అందుకునేందుకు.. గత వారం ప్రదర్శనను పునరావృతం చేస్తే సరిపోతుంది. ఆర్డర్ అటు ఇటుగా మారినా.. వరుసగా బెంగళూర్‌, ఢిల్లీ, ముంబయిలను మరోసారి ఓడిస్తే.. ఐపీఎల్‌ టైటిల్‌పై ఆరెంజ్‌ ఆర్మీ ముద్దు ముద్ర పడనుంది. 

నేడు హైదరాబాద్‌ తొలి సవాల్‌ ఎదుర్కొనుంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో ఎలిమినేటర్‌లో తలపడనుంది. చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన హైదరాబాద్‌.. చివరి నాలుగు మ్యాచుల్లో పరాభవ భారం మోసిన బెంగళూర్‌ను నేడు ఢీకొట్టనుంది.  

పాత ప్రదర్శనలు లెక్కలోని రాని మ్యాచ్‌లో.. ఎవరు ఆత్మవిశ్వాసంతో ఆడితే వారినే విజయం వరించనుంది. ఢిల్లీతో క్వాలిఫయర్‌2 కయ్యానికి చేరుకునేదెవరో, ఇక్కడ నుంచి నిష్ర్కమించేదెవరో నేటి ఎలిమినేటర్‌ తేల్చనుంది. అబుదాబిలో రాత్రి 7.30 గంటలకు ఎలిమినేటర్‌ పోరు ఆరంభం.

క్వాలిఫయర్‌కు చేర్చేది మిడిల్‌ మెరుపులే! 

అబుదాబి ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అలాగని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ అవకాశాలను ఏమాత్రం తక్కువగా చూడలేం. లీగ్‌ దశ ఆఖరు దశలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కుదురుకోగా.. ఆఖరు దశ మ్యాచుల్లో విరాట్‌ సేన వైఫల్యాలు మరింత స్పష్టంగా కనిపించాయి.

టాప్‌ ఆర్డర్‌, బౌలింగ్‌ విభాగాల్లో రెండు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌, బెంగళూర్‌లకు మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. నేటి కీలక ఎలిమినేటర్‌లో ఏ జట్టు మిడిల్‌ ఆర్డర్‌ మెరిస్తే.. ఆ జట్టునే విజయం వరించనుంది!.

వృద్దిమాన్‌ సాహా రాకతో పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌ ఆట ఆడేందుకు డెవిడ్‌ వార్నర్‌కు వెసులుబాటు చిక్కింది. నేడూ సాహా తోడుగా వార్నర్‌ అదే దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. నం.3, నం.4 స్థానాల్లో మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌లు ఫామ్‌లో ఉన్నారు. కేన్‌ తర్వాతి రానున్న బ్యాట్స్‌మెన్‌ సామర్థ్యంపై ఇంకా అనుమానాలు తొలగలేదు. దీంతో ఈ నలుగురుని వీలైనంత త్వరగా వెనక్కి పంపితే.. అనుభవం లేని మిడిల్‌ ఆర్డర్‌తో ఆడుకోవచ్చని బెంగళూర్‌ వ్యూహం. బెంగళూర్‌, హైదరాబాద్‌ లీగ్‌ దశ తొలి మ్యాచ్‌లో ఇదే జరిగింది.  164 పరుగుల లక్ష్యాన్ని టాప్‌ ఆర్డర్‌ ఊదేసినంత పని చేసింది. కానీ బెయిర్‌స్టో నిష్కమణతో కథ మారింది. మిడిల్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టి సీజన్‌లో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది.

బెంగళూర్‌ బ్యాటింగ్‌ లైనప్‌లోనూ మిడిల్‌ ఆర్డర్‌దే ప్రధాన బలహీనత. దేవ్‌దత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు బెంగళూర్‌ బ్యాటింగ్‌ భారాన్ని మోస్తున్నారు. ఆరంభంలోనే పడిక్కల్‌, విరాట్‌ కోహ్లిలను అవుట్‌ చేయగలిగితే.. హైదరాబాద్‌ పట్టు బిగించగలదు.  మిడిల్‌ ఓవర్లలో (7-16) బెంగళూర్‌ రన్‌రేట్‌ అత్యల్పం.  

ఈ ఓవర్లలో 7.14 రన్‌రేట్‌తో బెంగళూర్‌ పరుగుల వేట బాగా నెమ్మదించింది. బలమైన బౌలింగ్‌ లైనప్‌ కలిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ బలహీనతను రెండు చేతులా అందిపుచ్చుకోగలదు.  అందుకే బెంగళూర్‌ సైతం, మిడిల్‌ ఆర్డర్‌ను హైదరాబాద్‌ బౌలర్ల దూకుడుకు పణంగా పెట్టకూడదని కోహ్లి వ్యూహ బృందం ఆలోచన. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బ్యాటింగ్‌ లైనప్‌లలో ఎవరి మిడిల్‌ ఆర్డర్‌ రాణిస్తే.. వారిదే క్వాలిఫయర్‌ 2 బెర్త్‌.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా):

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), వృద్దిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియామ్‌ గార్గ్‌, జేసన్‌ హోల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, సందీప్‌ శర్మ, టి నటరాజన్‌.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌: దేవ్‌దత్‌ పడిక్కల్‌, జోశ్‌ ఫిలిప్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబె, మోయిన్‌‌ అలీ, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వెంద్ర చాహల్‌.