ఈ ఏడాది ఐపీఎల్ చాలా స్పెషల్. కరోనా దెబ్బను తట్టుకుని మరీ, ఈ మెగా లీగ్‌ను నిర్వహించాలని గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తోంది బీసీసీఐ. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఓ ఛాలెంజ్‌గా తీసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని గట్టి సంకల్పం తీసుకున్నాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.

ప్రేక్షకుల లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరగబోయే ఈ సీజన్, కచ్ఛితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు చాలామంది విదేశీ క్రికెటర్లు, విశ్లేషకులు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల వ్యవధి ఉండగానే అభిమానుల సందడి మొదలైపోయింది. 

సెప్టెంబర్ 19న జరిగే మొదటి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. దాదాపు 15 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆడబోతున్న తొలి మ్యాచ్ ఇదే. దాంతో ధోనీ మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరోవైపు రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వస్తానని ప్రకటించాడు. దాంతో ‘హిట్ మ్యాన్’ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అతని ఫ్యాన్స్. ఆరు నెలలుగా అసలు సిసలైన క్రికెట్ మజాను మిస్ అయిన క్రికెట్ ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్ చాలారోజుల తర్వాత దొరికిన ఓ విందు భోజనంలాంటింది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పటికే ‘CSKvsMI’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.