బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆర్సిబి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. బ్యాట్ మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ పై  ఆర్సిబి అద్భుత విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాట్ మెన్స్ ఎబి డివిలియర్స్, స్టోయినిస్ చివరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగా భారీగా పరుగులపు పిండుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఐపిఎల్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. 

డెత్  ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న డివిలియర్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చేలరేగాడు.ఇదే సమయంలో స్టోయినీస్ మెరుపులు కూడా తోడవడంతో ఆర్సిబి రికార్డు పరుగులను సాధించింది. కేవలం చివరి  రెండు ఓవర్లలో వీరిద్దరు కలిసి ఏకంగా 48 పరుగులను రాబట్టారు. దీంతో 18వ ఓవర్ కు ముందు 170-180 మధ్య వున్న అంచనా స్కోరు 20 ఓవర్లకు చేరేసరికి 202కు చేరింది. 

ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో చివరి రెండు ఓవర్లలో 45 పరగులు మాత్రమే అత్యధిక స్కోరు. కానీ ఆ రికార్డును తాజా ఇన్సింగ్స్ తో బెంగళూరు బ్రేక్ చేసింది. గతంలో బెంగళూరు, చెన్నై, ముంబై, డిల్లీకు చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు రాబట్టిన రికార్డు వుంది. కానీ తాజాగా డివిలియర్స్, స్టోయినీస్ వీరబాదుడుకు ఆ రికార్డు బద్దలై నయా రికార్డు నమోదయ్యింది. 
    
ఈ సీజన్లో ఆర్సిబి తరపున బ్యాటింగ్ కు దిగిన డివిలియర్స్  డెత్ ఓవర్లలోనే 146 పరుగులను సాధించాడు. 265 స్ట్రైక్ రేట్ తో ప్రతి 2.5 బంతులకు ఓ బౌండరీ చొప్పున బాదుతూ అతడీ పరుగులను సాధించాడు. ఇలా తాను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ను అని డివిలియర్స్ మరోసారి నిరూపించుకున్నాడు.

తాజా మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోస్తూ 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంలో కేవలం 44 బంతుల్లోనే 82 పరుగులను సాధించిన డివిలియర్స్ ఆర్సిబిని విజయతీరాలకు చేర్చాడు. 203 పరుగుల భారీ లక్ష్యచేధన సాధ్యంకాక పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 17 పరుగుల  తేడాతో ఆర్సిబి విజయం సాధించింది.