Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ పై చేతులెత్తేసిన హైదరాబాద్

ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లు రబడ (4/22), మోరిస్‌ (3/22), కీమో పాల్‌(3/17) సన్‌రైజర్స్‌ బ్యాట్స్ మెన్ నడ్డివిరిచారు.

IPL 2019: Delhi capitals defeat Sun Risers Hyderabad
Author
Hyderabad, First Published Apr 15, 2019, 6:59 AM IST

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తయింది. లక్ష్య ఛేదనలో చతికిలబడి 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో సన్‌రైజర్స్‌ ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి నమోదైంది. 

ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లు రబడ (4/22), మోరిస్‌ (3/22), కీమో పాల్‌(3/17) సన్‌రైజర్స్‌ బ్యాట్స్ మెన్ నడ్డివిరిచారు.

హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(51), బెయిర్‌ స్టో(41)లు శుభారంభాన్ని అందించినప్పటికీ మిడిలార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బెయిర్‌ స్టో అవుటైన తర్వాత విలియమ్సన్ (3)తో పాటు సన్‌రైజర్స్‌ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు బాట పడుతూ వచ్చారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి రికీ భుయ్‌(7), శంకర్‌(1), హుడా(3), అభిషేక్‌(3), రషీద్‌(0)లు చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్‌కు ఘోర ఓటమి తప్పలేదు. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పృథ్వీ షా (4), శిఖర్‌ ధావన్‌(7) విఫలమయ్యారు. ఆ తర్వాత కొలిన్‌ మున్రో(40: 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోతుంటే, శ్రేయాస్‌ అయ్యర్‌(45; 40 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు.

ఆ తర్వాత రిషభ్‌ పంత్‌(23), అక్షర్‌ పటేల్‌(14)లు రెండంకెల స్కోరు చేశారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ రెండు వికెట్లు తీశాడు. అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios