పూణే: ఇంగ్లండుతో వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తొలి వన్డేలో విజయం సాధించి ఊపు మీదున్న ఇంగ్లండుతో జరిగే తదుపరి మ్యాచులకు శ్రేయాస్ అయ్యర్ దూరం కానున్నాడు. తొలి వన్డేలో ఇంగ్లండు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బంతిని ఆపే ప్రయత్నంలో అతని భుజానికి బలమైన దెబ్బ తగిలింది. 

ఆ తర్వాత వెంటనే అతను మైదానాన్ని వీడాడు. అతన్ని స్కానింగ్ కోసం పంపించారు. గాయం తీవ్రత వల్ల తదుపరి మ్యాచులకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అయితే, అయ్యర్ గాయం తీవ్రతపై బిసీసీఐ ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక సమాచారం ఇవ్వలేదు. 

మిగిలిన వన్డేలకు శ్రేయాస్ అయ్యర్ దూరమైతే అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి దిగే అవకాశాలున్నాయి. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వుడ్ వేసిన బంతి రోహిత్ శర్మ కుిడ మోచేతికి తాకింది. నొప్పికి అతను మైదానంలోనే రెండు సార్లు అతను చికిత్స చేయించుకుని ఆటను కొనసాగించాడు 

ఆ తర్వాత అతను ఫీల్డింగ్ కు దిగలేదు. అయితే, రోహిత్ శర్మకు తగిలిన గాయం పెద్దదేమీ కాదు. దాంతో అతను రెండో వన్డే ఆడే అవకాశం ఉంది. ఫీల్డింగులో గాయపడిన ఇంగ్లండు కెప్టెన్ మోర్గాన్ కూడా చేతికి నాలుగు కుట్ల వేయించుకుని బ్యాటింగ్ చేశాడు.