టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... కుల్దీప్ యాదవ్‌కి గాయం, రవి భిష్ణోయ్‌కి అవకాశం.. 

గయానాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20లో టాస్ ఓడి ఫీల్డింగ్ చేసిన టీమిండియా, రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. ఆరంగ్రేటం ఆటగాడు తిలక్ వర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి మెప్పించినా.. 150 పరుగుల లక్ష్యఛేదనలో 145 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు. సంజూ శాంసన్ కంటే ముందు హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌కి రావడం, టీ20ల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న ఇషాన్ కిషన్‌ని కొనసాగించి, యశస్వి జైస్వాల్‌ని పట్టించుకోకపోవడం... తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమయ్యాయి..

విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన స్థితిలో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా వంటి బ్యాటర్లు క్రీజులో ఉన్నా చేజేతులా ఓడిన టీమిండియా, రెండో టీ20లో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా, గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క 50+ స్కోరు కూడా కొట్టలేకపోయాడు. అంతేకాదు గత ఏడాది కాలంలో హార్దిక్ పాండ్యా బ్యాటు నుంచి రెండుసార్లు మాత్రమే 30+ స్కోరు నమోదైంది..

గత మ్యాచ్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన భారత జట్టు, నేటి మ్యాచ్‌లో కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతోంది. అయితే కుల్దీప్ యాదవ్ చేతికి గాయం కావడంతో అతని ప్లేస్‌లో యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌కి అవకాశం ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్రకటించాడు. గత మ్యాచ్‌లో 3 స్పిన్నర్లతో బరిలో దిగినా అక్షర్ పటేల్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా యజ్వేంద్ర చాహాల్ 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.

టీ20ల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న ఇషాన్ కిషన్‌కి మరో అవకాశం ఇచ్చిన హార్ధిక్ పాండ్యా అండ్ కో, ఐపీఎల్‌లో అదరగొట్టిన యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌కి మరోసారి మొండిచేయి చూపించారు. ఇషాన్ కిషన్‌కి మరో రెండు మ్యాచుల్లో ఛాన్స్ ఇచ్చి, అతను వాటిల్లో కూడా ఫెయిల్ అయితే యశస్వి జైస్వాల్‌ వైపు చూడాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు ఉంది.

తొలి టీ20లో ఉత్కంఠ విజయం అందుకున్న వెస్టిండీస్, రెండో టీ20లో ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టును కొనసాగిస్తోంది. గత మ్యాచ్‌లో అకీల్ హుస్సేన్, రొమారియో షెఫర్డ్, జాసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు..

వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ ఛార్లెస్, నికోలస్ పూరన్, రోవ్‌మెన్ పావెల్, సిమ్రాన్ హెట్మయర్, రొమారియో షెఫర్డ్, జాసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్, ఓబెడ్ మెక్‌కాయ్

భారత తుది జట్టు: ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ముకేశ్ కుమార్, రవి భిష్ణోయ్