India vs South Africa: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా... వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్... 

టీమిండియాతో జరుగుతున్న డిసైడర్ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టు కెప్టెన్ కేశవ్ మహరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌లో వరుసగా ఐదు టీ20 మ్యాచుల్లోనూ టాస్ ఓడిపోయాడు రిషబ్ పంత్... కెప్టెన్‌గా తొలి ఐదు మ్యాచుల్లో టాస్ ఓడిపోయిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్...

తొలి రెండు మ్యాచుల్లో సౌతాఫ్రికా విజయం సాధించగా, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుని సిరీస్‌ని 2-2 తేడాతో సమం చేసింది టీమిండియా. దీంతో ఆఖరి టీ20 మ్యాచ్ ఫలితం, సిరీస్ విజేతను తేల్చనుంది...

నాలుగో టీ20లో గాయపడి, తిరిగి బ్యాటింగ్‌కి కూడా రాని తెంబ భవుమా నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. అతని స్థానంలో కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆఖరి మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలో దిగుతోంది సౌతాఫ్రికా... టీమిండియా మాత్రం ఆఖరి మ్యాచ్‌లోనూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది.

సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, కేశవ్ మహారాజ్, లుంగి ఇంగిడి, ఆన్రీచ్ నోకియా

టీమిండియా: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, ఆవేశ్ ఖాన్


2016 నుంచి సిరీస్ డిసైడర్ మ్యాచుల్లో టీమిండియా ఘన విజయాలు అందుకుంటూ వస్తోంది. గత 11 డిసైడర్ మ్యాచుల్లో 9 విజయాలు అందుకుంది భారత జట్టు. అయితే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంక టూర్‌లో జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. కానీ ఆ సిరీస్‌లో మొదటి మ్యాచ్ తర్వాత టీమిండియా బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో 8 మంది ప్లేయర్లు దూరం కావడం, రిజర్వు బెంచ్‌ ప్లేయర్లతో బరిలో దిగడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు...

ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ టీమిండియాని కలవరబెడుతోంది. టీ20 సిరీస్‌లో 4 మ్యాచుల్లో కలిపి 57 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్. తొలి టీ20లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రిషబ్ పంత్, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో కలిపి 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్న బ్యాటర్‌గా చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్, బ్యాటర్‌గా తన స్థానం పదిలం చేసుకోవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక పరుగులు చేయాల్సిందే... మొదటి రెండు మ్యాచుల్లో విఫలమైన భారత బౌలర్లు, ఆ తర్వాత అదిరిపోయే పర్పామెన్స్‌తో భారత జట్టుకి అద్భుత విజయాలు అందించారు...

మొదటి మూడు మ్యాచుల్లో వికెట్ తీయలేకపోయిన ఆవేశ్ ఖాన్, నాలుగో టీ20లో 4 వికెట్లు తీయగా... రెండో టీ20లో భువనేశ్వర్ కుమార్, మూడో టీ20లో హర్షల్ పటేల్ నాలుగేసి వికెట్లు తీశారు. తొలి రెండు మ్యాచుల్లో ఫెయిలైన యజ్వేంద్ర చాహాల్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో 5 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

బెంగళూరులో జరిగిన గత రెండు టీ20 మ్యాచుల్లో భారత జట్టు పరాజయం పాలైంది. 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీ20 ఓడిన టీమిండియా, అదే ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్‌లో పరాజయం చెందింది.