Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 3rd Test: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... రిషబ్ పంత్, అశ్విన్ అవుట్...

కేప్ టౌన్ టెస్టు: 159 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ... 27 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్, 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

INDvsSA 3rd Test: Virat Kohli completes second slowest half century, Ravi Ashwin, Rishabh Pant
Author
India, First Published Jan 11, 2022, 7:55 PM IST

కేప్ టౌన్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలిరోజే భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయినా అతనికి అవతలి ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించడం లేదు.  159 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, టెస్టు కెరీర్‌లో రెండో అతి నెమ్మదైన అర్ధశతకం నమోదు చేశాడు...

ఇంతకుముందు 2012లో నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌పై 171 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత అర్ధశతకం బాదేందుకు ఇన్ని బంతులు వాడుకోవడం ఇదే మొదటి సారి. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కెఎల్ రాహుల్ 35 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 35 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

డాన్నే ఓలీవర్‌, కెఎల్ రాహుల్ వికెట్ తీయగా, కగిసో రబాడాకి మయాంక్ అగర్వాల్ వికెట్ దక్కింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు. పూజారా తన బ్యాటింగ్ స్టైల్‌కి విరుద్ధంగా దూకుడుగా బ్యాటింగ్ చేయగా, విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు..

సౌతాఫ్రికాలో ప్రస్తుతం ఏడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ 625+ పరుగులు పూర్తి చేసుకుని, సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ ద్రావిడ్‌ రికార్డుని అధిగమించాడు...

ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సఫారీ గడ్డపై 11 టెస్టు మ్యాచులు ఆడి 624 పరుగులు చేశాడు... ఇప్పటిదాకా సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా ఉండేవాడు ద్రావిడ్... ఇప్పుడు ఆ రికార్డు విరాట్‌ పుస్తకాల్లోకి వెళ్లిపోయింది...
 

77 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెన్నేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన అజింకా రహానే, కగిసో రబాడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. రబాడా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, 2018 తర్వాత విదేశీ గడ్డపై తొలి సిక్సర్ నమోదుచేశాడు. 2020 జనవరి నుంచి టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఓవరాల్‌గా ఇది రెండో సిక్సర్ మాత్రమే...

అజింకా రహానే అవుటైన తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి ఐదో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు విరాట్ కోహ్లీ. 50 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన రిషబ్ పంత్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 10 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి జాన్సెన్ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 175 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...

Follow Us:
Download App:
  • android
  • ios