Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 3rd Test: అజింకా రహానే మళ్లీ ఫెయిల్... నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

India vs South Africa 3rd Test: 116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా... 9 పరుగులు చేసి అవుట్ అయిన అజింకా రహానే...

INDvsSA 3rd Test: Ajinkya Rahane fails to score huge, Team India losses four wickets
Author
India, First Published Jan 11, 2022, 6:00 PM IST

INDvsSA 3rd Test: కేప్ టౌన్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కెఎల్ రాహుల్ 35 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 35 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

డాన్నే ఓలీవర్‌, కెఎల్ రాహుల్ వికెట్ తీయగా, కగిసో రబాడాకి మయాంక్ అగర్వాల్ వికెట్ దక్కింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు. పూజారా తన బ్యాటింగ్ స్టైల్‌కి విరుద్ధంగా దూకుడుగా బ్యాటింగ్ చేయగా, విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు..

సౌతాఫ్రికాలో ప్రస్తుతం ఏడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ 625+ పరుగులు పూర్తి చేసుకుని, సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ ద్రావిడ్‌ రికార్డుని అధిగమించాడు...

ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సఫారీ గడ్డపై 11 టెస్టు మ్యాచులు ఆడి 624 పరుగులు చేశాడు... ఇప్పటిదాకా సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా ఉండేవాడు ద్రావిడ్... ఇప్పుడు ఆ రికార్డు విరాట్‌ పుస్తకాల్లోకి వెళ్లిపోయింది...

అయితే టీమిండియా తరుపున సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాలంటే మాత్రం విరాట్ కోహ్లీ మరికొంత కాలం ఆగాల్సిందే...

సౌతాఫ్రికాలో 15 టెస్టు మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్... ఏకంగా 1161 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు.  రాహుల్ ద్రావిడ్‌ని అధిగమించిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డును చేరుకోవాలంటే మరో 500+ పరుగులు చేయాల్సి ఉంటుంది...

77 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెన్నేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన అజింకా రహానే, కగిసో రబాడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. రబాడా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, 2018 తర్వాత విదేశీ గడ్డపై తొలి సిక్సర్ నమోదుచేశాడు. 2020 జనవరి నుంచి టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఓవరాల్‌గా ఇది రెండో సిక్సర్ మాత్రమే...

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్న అజింకా రహానే, మరోసారి స్వల్ప స్కోరుకే అవుట్ కావడం విమర్శలకు తావిస్తోంది. గత టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగులు చేసిన హనుమ విహారిని తప్పించి, అజింకా రహానేకి మరో అవకాశం ఇవ్వడంపై ట్రోల్స్ వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios