Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 2nd Test: నిలిచిన వర్షం... రెండు సెషన్లు రద్దు, ఆఖరి రోజు వరకూ...

India vs South Africa: వర్షం కారణంగా నాలుగో రోజు రెండు సెషన్ల ఆట రద్దు... మూడో సెషన్‌లో 34 ఓవర్ల వరకూ ఆట జరిగే అవకాశం...

INDvsSA 2nd Test: two sessions cancelled due to rain on day 4, match will goes to
Author
India, First Published Jan 6, 2022, 6:44 PM IST

INDvsSA 2nd Test: సౌతాఫ్రికా, టీమిండియా మధ్య జోహన్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు కూడా ఆఖరి రోజు వరకూ సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాలుగో రోజు వర్షం కారణంగా మొదటి రెండు సెషన్లు రద్దు అయ్యాయి. లోకల్ టైం దాదాపు 3 గంటల సమయంలో వర్షం నిలవడంతో పిచ్‌ను మ్యాచ్‌కి సిద్ధం చేసేందుకు 3:45 వరకూ (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:15 సమయం తీసుకున్నారు అంపైర్లు... 

దీంతో టీ బ్రేక్ ముగిసిన తర్వాత నాలుగో రోజు మూడో సెషన్‌లో 30 నుంచి 34 ఓవర్ల పాటు మాత్రమే ఆటసాగనుంది. సౌతాఫ్రికా చేతుల్లో ఇంకా 8 వికెట్లు ఉండడం, 122 పరుగులు చేయాల్సి ఉండడంతో నేడు మ్యాచ్ ఫలితం వస్తుందా? లేక ఆఖరి రోజు వరకూ వెళ్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

240 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికా జట్టు, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ అయిడిన్ మార్క్‌రమ్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిది సౌతాఫ్రికా...

ఆ తర్వాత డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ కలిసి రెండో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 44 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ను రవిచంద్రన్ అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సఫారీ జట్టు...

సౌతాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి... కెప్టెన్ డీన్ ఎల్గర్ 121 బంతుల్లో 2 ఫోర్లతో 46 పరుగులు చేసి, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 37 బంతుల్లో 11 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు... భారత జట్టు విజయాన్ని అందుకోవాలంటే 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది.

తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, టెస్టు కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల పర్ఫామెన్స్‌ను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మొదటి వికెట్ శార్దూల్ ఠాకూర్‌కే దక్కింది...

జోహన్‌బర్గ్‌లో ఇప్పటిదాకా ఆరు టెస్టులు ఆడిన భారత జట్టు, ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. రెండు మ్యాచుల్లో విజయాలను అందుకున్న టీమిండియా, మిగిలిన మ్యాచులను డ్రాగా చేసుకుంది. అయితే రెండో టెస్టులో గెలవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేయడంతో ఆతిథ్య జట్టుకి 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఈ 27 పరుగులే ఇప్పుడు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి...

రెండో ఇన్నింగ్స్‌లో అజింకా రహానే 78 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 86 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేసి అవుట్ కాగా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన హనుమ విహారి 84 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios