Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 2nd Test: రెండో టెస్టులో టీమిండియాకి షాక్... సిరీస్ సమం చేసిన సౌతాఫ్రికా...

India vs South Africa: 7 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించిన సౌతాఫ్రికా... జోహన్‌బర్గ్‌లో టీమిండియాకి మొదటి టెస్టు ఓటమి... 

INDvsSA 2nd Test: Team India lost second test against South Africa, Dean Elgar captain innings
Author
India, First Published Jan 6, 2022, 9:23 PM IST

సఫారీ టీమ్ కంచుకోట సెంచూరియన్‌లో తొలి టెస్టులో విజయాన్ని అందుకున్న టీమిండియాకి సౌతాఫ్రికా... జోహన్‌బర్గ్‌లో పరాజయాన్ని పరిచయం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా... వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది సౌతాఫ్రికా...

జనవరి 11 నుంచి కేప్‌టౌన్ వేదికగా జరిగే మూడో టెస్టు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. ఒకవేళ మూడో టెస్టు ఏ కారణం వల్లనైనా డ్రాగా ముగిస్తే, సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనే టీమిండియా కళ నెరవేరాలంటే మరికొన్నేళ్లు వేచి చూడాల్సిందే... 

నాలుగో రోజు వర్షం కారణంగా తొలి రెండు సెషన్లు రద్దు కాగా, మూడో సెషన్‌లో ఆట తిరిగి ప్రారంభమైంది. ఓవర్‌నైట్ స్కోర్ 118/2 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకి మంచి ఆరంభమే దక్కింది...

వాన్ దేర్ దుస్సేన్, కెప్టెన్ డీన్ ఎల్గర్ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. 92 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌ను మహ్మద్ షమీ అవుట్ చేశాడు...

175 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. అప్పటికి సఫారీ జట్టు విజయానికి 65 పరుగులు కావాలి. అయితే తెంబ భవుమాతో కలిసి నాలుగో వికెట్‌కి 68 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు కెప్టెన్ డీన్ ఎల్గర్...

భారత బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఎంతో ఓపికగా బ్యాటింగ్ కొనసాగించిన డీన్ ఎల్గర్, కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో సఫారీ జట్టుకి కీలక విజయాన్ని అందించాడు. 188 బంతుల్లో 10 ఫోర్లతో 96 పరుగులు చేసిన డీన్ ఎల్గర్, బౌండరీతో మ్యాచ్‌ని ముగించగా... 45 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన తెంబ భవుమాతో నాటైట్‌గా నిలిచాడు.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అయిడిన్ మార్క్‌రమ్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిది సౌతాఫ్రికా...

ఆ తర్వాత డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ కలిసి రెండో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 44 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ను రవిచంద్రన్ అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సఫారీ జట్టు...

 తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, టెస్టు కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల పర్ఫామెన్స్‌ను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మొదటి వికెట్ శార్దూల్ ఠాకూర్‌కే దక్కింది...

జోహన్‌బర్గ్‌లో ఇప్పటిదాకా ఆరు టెస్టులు ఆడిన భారత జట్టుకి ఇదే మొదటి ఓటమి... ఇంతకుముందు రెండు మ్యాచుల్లో విజయాలను అందుకున్న టీమిండియా, మూడు మ్యాచులను డ్రాగా చేసుకుంది.  

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేయడంతో ఆతిథ్య జట్టుకి 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఈ 27 పరుగులే ఇప్పుడు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి...

రెండో ఇన్నింగ్స్‌లో అజింకా రహానే 78 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 86 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేసి అవుట్ కాగా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన హనుమ విహారి 84 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios