Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 2nd ODI: భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా... సిరాజ్ మెరిసినా టీమిండియా ముందు...

టీమిండియా ముందు 279 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా... 3 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... హాఫ్ సెంచరీలతో మెరిసిన రీజా హెన్రిక్స్, అయిడిన్ మార్క్‌రమ్...

INDvsSA 2nd ODI:  Mohammed Siraj picks 3 wickets, huge target for team India
Author
First Published Oct 9, 2022, 5:30 PM IST

సౌతాఫ్రికాతో మొదటి వన్డేలో విఫలమైన భారత బౌలర్లు రెండో వన్డేలోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. భారత బౌలర్ల వైఫల్యానికి తోడు పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తుండడంతో చెలరేగిపోయిన సౌతాఫ్రికా, టీమిండియా ముందు భారీ టార్గెట్‌ను ఉంచగలిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది... ఇప్పటికే తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో పోరాడి ఓడిన భారత జట్టు నేటి మ్యాచ్‌లో ఓడితే వన్డే సిరీస్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. 

8 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ సిరాజ్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన జానెమ్నన్ మలాన్, తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న షాబజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...

ఈ దశలో రీజా హెన్రిక్స్, అయిడిన్ మార్క్‌రమ్ కలిసి మూడో వికెట్‌కి 129 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు.76 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసిన రీజా హెన్రిక్స్‌కి అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్, టీమిండియాకి అవసరమైన బ్రేక్‌ని అందించాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసిన్, అయిడిన్ మార్క్‌రమ్ కలిసి ఐదో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసిన్‌ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా 89 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 79 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

వోన్ పార్నెల్ 22 బంతుల్లో 16 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా 13 బంతుల్లో 5 పరుగులు చేసిన కేశవ్ మహరాజ్‌ని మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 34 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు డేవిడ్ మిల్లర్.  

భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఇంప్రెసివ్ స్పెల్ వేశాడు. దీపక్ చాహార్ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ 9 ఓవర్లలో 60 పరుగులిచ్చి ఓ వికెట్ తీయగా ఆరంగ్రేటం వన్డే ఆడుతున్న షాబాజ్ అహ్మద్ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు...

ఆవేశ్ ఖాన్  7 ఓవర్లలో 35 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోగా కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లకు చెరో వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios