India vs South Africa: 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా... బౌలింగ్ చేస్తూ గాయపడిన జస్ప్రిత్ బుమ్రా...
INDvsSA 1st Test: సెంచూరియన్ టెస్టులో భారత జట్టును ఓ మోస్టరు స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం, సౌతాఫ్రికా జట్టుకి ఎంతోసేపు నిలవలేదు. ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ జట్టు, 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను కెఎల్ రాహుల్ అందుకుని ఉంటే వికెట్ల సంఖ్య 5కి చేరేదే...
మొదటి ఓవర్‌లోనే సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను అవుట్ చేసి, సఫారీ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు జస్ప్రిత్ బుమ్రా... బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఎల్గర్.
టెస్టు కెరీర్‌లో జస్ప్రిత్ బుమ్రాకి ఇది 100వ వికెట్.
22 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు... 25 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత అయిడిన్ మార్క్‌రమ్ 34 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...
రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 18 బంతుల్లో 3 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అజింకా రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రకిా. దుస్సేన్ అవుటైన తర్వాతి బంతికే క్వింటన్ డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను కెఎల్ రాహుల్ ఒడిసి పట్టుకోలేకపోయాడు. దీంతో తృటిలో మరో వికెట్ చేజారింది...
గోల్డెన్ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న క్వింటన్ డి కాక్, 11 బంతుల తర్వాత శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి ఓవర్‌లోనే వరుస రెండు బౌండరీలతో ఖాతా తెరిచాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది సౌతాఫ్రికా...
భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టు టాపార్డర్ వికెట్లు తీసి అదరగొట్టినా, టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా... బౌలింగ్ చేసే సమయంలో తీవ్రంగా గాయపడి పెవిలియన్ చేరడం... భారత అభిమానులను కలవరబెడుతున్న అంశం. తన ఆరో ఓవర్‌లో మొదటి నాలుగు బంతులు సరిగానే వేసిన బుమ్రా, ఐదో బంతి డెలివరీ చేసే సమయంలో మడమ మెలితిరిగింది.
నొప్పిని భరించలేక విలవిలలాడుతూ ఆ ఓవర్ పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరాడు జస్ప్రిత్ బుమ్రా. అతని గాయం నిజంగా తీవ్రమైనది అయితే టెస్టు సిరీస్‌లో భారత జట్టుకి కష్టాలు తప్పకపోవచ్చు...
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 272/3 వద్ద మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా, 47 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయింది. కెఎల్ రాహుల్ 123 పరుగులు చేయగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 60, అజింకా రహానే 48, విరాట్ కోహ్లీ 35 పరుగులు చేశారు. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ తీవ్రంగా నిరాశపరచగా ఛతేశ్వర్ పూజారా డకౌట్ అయ్యాడు..
సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఇంగిడి ఆరు వికెట్లు తీయగా, రబాడాకి మూడు వికెట్లు దక్కాయి. సెంచూరియన్‌లో భారత జట్టుపై రెండోసారి ఆరు వికెట్లు తీసిన సఫారీ బౌలర్‌గా నిలిచాడు ఇంగిడి...
