INDvsSA 1st T20I: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా... వరుసగా 12 టీ20 మ్యాచుల్లో గెలిచిన టీమిండియా, నేటి మ్యాచ్‌లో గెలిస్తే వరల్డ్ రికార్డు...
ఐపీఎల్ 2022 సీజన్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రెండు నెలలకు పైగా సుదీర్ఘ విరామం తీసుకున్న భారత జట్టు, నేటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో పరాజయాల తర్వాత వరుసగా ఆఫ్ఘాన్, స్కాట్లాండ్, నమీబియాలపై విజయాలు అందుకున్న టీమిండియా, స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలపై టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసి... 12 వరుస విజయాలతో ఉంది. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు రొమానియా జట్లు ఇంతకుముందు టీ20ల్లో వరుసగా 12 విజయాలు అందుకున్నాయి. నేటి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే వరుసగా 13 మ్యాచుల్లో విజయాలు అందుకున్న మొట్టమొదటి జట్టుగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తుంది.
సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడంతో రిషబ్ పంత్... టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు... అతి పిన్న వయసులో టీ20 కెప్టెన్సీ చేపట్టబోతున్న రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్...
ఇంతకుముందు సురేష్ రైనా 23 ఏళ్ల 197 రోజుల వయసులో టీమిండియా టీ20 కెప్టెన్సీ చేపట్టగా, రిషబ్ పంత్ 24 ఏళ్ల 249 రోజుల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు.
టీమిండియా సీనియర్లు, టాప్ 3 ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది బీసీసీఐ. సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ కూడా గాయపడి, తప్పుకోవడంతో టాప్ 4 ప్లేయర్లు లేకుండా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు...
నేటి మ్యాచ్ ద్వారా ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి కొత్త కుర్రాళ్లకు అవకాశం దక్కుతుందని ఫ్యాన్స్ ఆశించినా, తొలి టీ20లో అలాంటి సాహసం చేయలేదు టీమిండియా. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్‌లకు తుదిజట్టులో అవకాశం దక్కింది. స్పిన్నర్లుగా యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్.. నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నారు...
సౌతాఫ్రికా జట్టుకి తొలి మ్యాచ్‌కి ముందు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్ కరోనా బారిన పడడంతో నేటి మ్యాచ్‌లో అతను అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో యంగ్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్‌కి అవకాశం దక్కింది.
సౌతాఫ్రికా జట్టు: తెంబ భువుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వోనే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తంబ్రేజ్ షంసీ, కగిసో రబాడా, ఆన్రీచ్ నోకియా
భారత జట్టు ఇది: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, ఆవేశ్ ఖాన్
